రుణం ఇప్పించిన మధ్యవర్తికి రూ.170కోట్ల లంచం అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం
చెప్పిన లెక్క ఇది ఈ భూములు అమ్మి రూ.40వేల కోట్లు తేవాలని సిఎం రేవంత్
ప్రయత్నం కంచ గచ్చిబౌలి భూముల విషయంలో అన్ని నిబంధనలు తుంగలో
తొక్కిన ప్రభుత్వం ఆందోళనలు చేసినా పట్టించుకోని అటవీశాఖ మాజీ
మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు సంచలన ఆరోపణలు అంతకుముందు
సుప్రీంకోర్టు ఎంపవర్ కమిటీకి నివేదిక అందజేసిన బిఆర్‌ఎస్ బృందం
మన తెలంగాణ/హైదరాబాద్ : కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వం నియమ నిబంధనలను ఉల్లంఘించిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు మండిపడ్డారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని పరిశీలించేందు కు పర్యావరణ, అటవీ శాఖల కేంద్ర సాధికారిక క మిటీ గురువారం హెచ్‌సియును సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. ఈ నేపథ్యంలో మా జీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బిఆర్‌ఎస్ ప్రతినిధి బృందం కమిటీతో భేటీ అయింది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో డాక్యుమెంట్లు, విజువల్స్‌తో కూడిన నివేదికను బిఆర్‌ఎస్ బృందం సుప్రీం కోర్టు పరిధిలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కి అందజేసింది. అనంతరం తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ నేతలు సబితా ఇంద్రారెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, కాలేరు వెంకటేష్, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌లతో కలిసి హరీష్‌రావు మీడియా సమావే శం నిర్వహించారు. అన్ని ఆధారాలతో క్షేత్ర స్థా యి వాస్తవ పరిస్థితులతో సుప్రీం కోర్టు పరిధిలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని కలిశామని తెలిపారు. కంచ గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి కాం గ్రెస్ ప్రభుత్వం గతేడాది నవంబర్ 22న రూ.10 వేల కోట్లు రుణం తెచ్చిందని హరీష్‌రావు ఆరోపించారు. రుణం ఇప్పించడంలో మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తికి రూ. 169 కోట్ల 83 లక్షల అంటే సుమారుగా రూ.170 కోట్లు ఫీజుగా ఇప్పించారని పేర్కొన్నారు.
తాను ఈ విషయాన్ని సాక్షాత్తూ అసెంబ్లీలోనే లేవనెత్తానని, తాను అసెంబ్లీలో వేసిన ప్రశ్నకు.. రాతపూర్వకంగా ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానాన్నే చెబుతున్నారని అన్నారు. ఈ భూములను అమ్మి సిఎం రేవంత్ రెడ్డి 40 వేల కోట్లు తేవాలని ప్రయత్నం చేశారని చెప్పారు. ఫార్మాసిటీ కోసం 14 వేల ఎకరాలు సేకరించారు కదా.. దానిని అభివృద్ధి చేయండి అని, అక్కడ ఎలాంటి చెట్లు, వన్యప్రాణులు లేవు అని చెప్పానని పేర్కొన్నారు. సుప్రీoకోర్టు ఆదేశాల ఉల్లంఘన జరుగుతుందని, ఎలాంటి చర్యలు, పనులు చేపట్టొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన తర్వాత కూడా బుధవారం సాయంత్రం టీజీఐఐసీ భూమి అని బోర్టులు ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఇది సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులను ఉల్లంఘించడమే అవుతుందని, సిఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు అంటే కూడా భయం లేకుండా పోతున్నది అని ధ్వజమెత్తారు. కంచ భూముల విధ్వంసంలో పోలీస్ శాఖ పాత్ర కూడా ఉందని, గతంలో కొత్త సచివాలయం నిర్మించే సమయంలో చెట్లు నరకొద్దంటూ గ్రీన్ ట్రిబ్యునల్‌కి వెళ్లిన రేవంత్‌కు ఇన్ని చెట్లు నరకొద్దూ అని తెలియదా..? అని ప్రశ్నించారు. యూనివర్సిటీ భూములు తమకే చెందాలని విద్యార్థులు అడిగితే వారిపై కేసులు పెట్టారని మండిపడ్డారు.
రైతుకు ఒక చట్టం.. రేవంత్ రెడ్డికి ఒక చట్టమా..?
రైతు ఒక్క చెట్టు కొడితే కేసు నమోదు చేస్తున్నారని, రైతుకు ఒక చట్టం.. రేవంత్ రెడ్డికి ఒక చట్టమా..? అని హరీష్‌రావు ప్రశ్నించారు. కంచె చేను మేసినట్లుగా ప్రభుత్వం వేలాది చెట్లు నరికివేసిందని, వైల్డ్ లైఫ్ యాక్ట్, వాల్టా యాక్ట్ ఉల్లంఘించి ప్రభుత్వం వ్యవహరించిందని అన్నారు. వాల్టా చట్టం ప్రకారం చెట్లు కొట్టాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని, ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అటవీశాఖ అనుమతి ఇచ్చాకే చెట్లను నరకాల్సి ఉంటుందని చెప్పారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఆందోళన చేసినా అటవీ శాఖ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ శాఖ స్పందించకపోవడంతోనే చెట్లు నరికేశారని,
దాంతో జంతువులు చనిపోయాయని పేర్కొన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు, మార్గదర్శకాలు, నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ.. వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు.హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ సెలవు దినాలు చూసుకుని మరి జేసీబీలతో చెట్లు నరికివేశారని మండిపడ్డారు. ఆ భూములు హెచ్‌సియుకే చెందాలని తాము కమిటీకి విన్నవించామని చెప్పారు. హెచ్‌సియు భూముల్లో చెట్ల నరికివేతతో సిఎం రేవంత్ రెడ్డి ఏడు చట్టాలను దుర్వినియోగం చేశారని హరీష్‌రావు పేర్కొన్నారు.
జింకల మృతికి కారణమైన అధికారులపైన చర్యలేవీ..?
మూడు జింకలు చనిపోయాయి అని, వన్య ప్రాణుల గూడును చెదరగొట్టారని హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. జింకల మృతికి కారణమైన అధికారులపైన చర్యలేవీ..? అని నిలదీశారు. పర్యావరణ విధ్వoసం జరిగితే అటవీ అధికారులు నిద్ర పోతున్నారా..? అని ప్రశ్నించారు. ప్రైవేట్ భూమి అయినా అందులో చెట్లు పెరిగితే అందులో వన్య ప్రాణులు గూడు ఏర్పాటుచేసుకుంటే అది అటవీ భూమిగా పరిగణిస్తారని, 10 హెక్టార్ల కంటే ఎక్కువ భూమి ఉంటే.. అందులో చెట్లు ఉంటే అది అటవీ భూమిగానే పరిగణిస్తారని వివరించారు. 2011లో కంచ గచ్చిబౌలి భూముల్లో జిహెచ్‌ఎంసి లక్ష మొక్కలను నాటిందని, ఆ భూముల్లో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ నాటిన మొక్కలు కూడా ఉన్నాయని చెప్పారు. అరుదైన పక్షులు, జంతువులు, చెట్లు కంచ గచ్చిబౌలి భూముల్లో ఉన్నాయని తెలిపారు. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే వాటిని భక్షిస్తోందని అన్నారు. నేరం చేస్తుంటే చూస్తూ ఊరుకున్న ప్రతివారూ నేరస్తులే అని, అందరూ కలిసే నేరం చేశారని హరీష్‌రావు ఆరోపించారు.