ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం వార్తమన్నూరుకు చెందిన రైతు మామిళ్ళ నరసయ్య అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విచారకరం అని -మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే గడిచిన వారం రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని అన్నారు. రైతుల మరణ మృదంగం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్లు..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రైతన్నకు భరోసా లేక మనోధైర్యం కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. అందరికి అన్నం పెట్టే అన్నదాతకు సున్నం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ అని,
నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచి, నమ్మక ద్రోహం చేస్తున్నదని మండిపడ్డారు. రుణమాఫీ పూర్తి చేసినట్లు రంకెలేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతులకు ఏమని సమాధానం చెబుతారని అడిగారు. రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆ రైతు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని బిఆర్‌ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆత్మహత్యలు పరిష్కారం కావు, బతికుండి కొట్లాడుదామని పిలుపునిచ్చారు. రైతుల అధైర్య పడొద్దని,బిఆర్‌ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని హరీష్‌రావు పేర్కొన్నారు.