బిఆర్ఎస్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. కవిత అరెస్ట్ పై బిఆర్ఎస్ నేత హరీశ్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. కవిత అరెస్టుపై సుప్రీంకోర్టులో ఎదుర్కొంటామన్నారు. సుప్రీంకోర్టులో ఇచ్చిన మాటకు విరుద్ధంగా ఈడీ వ్యవహరించిందని హరీశ్ రావు మండిపడ్డారు. రాజకీయ కుట్రలో భాగంగానే కవితను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను ఈడీ అరెస్ట్ అంశంపై సుప్రీంలో కేసు విచారణ జరుగుతోందన్నారు.
కవితను అంత అత్యవసరంగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు చేపడతామన్నారు. దుర్మార్గ చర్యను బిఆర్ఎస్ ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటుందని హరీశ్ హెచ్చరించారు. దుర్మార్గ చర్యలపై బిజెపి, కాంగ్రెస్ కు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని.. కవిత అరెస్టుపై న్యాయపరంగా పోరాటుతామని ఆయన తెలిపారు. అక్రమ అరెస్టులకు నిరసనగా ఉద్యమిస్తామన్నారు. పోరాటాలు, అక్రమ కేసులు ఎదుర్కోవడం తమకు కొత్త కాదని హరీశ్ రావు పేర్కొన్నారు.