Thursday, January 23, 2025

అప్పులపై అబద్ధాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ప్రభుత్వం 6,71,757 కోట్లు అప్పు చేసిందని పదే పదే చెబుతున్నారని బిఆర్‌ఎస్ ఎంఎల్ ఎ హరీశ్‌రావు మండిపడ్డారు. డిసెంబర్ 23 నాడు కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేత పత్రంలో నాలుగు రకాల అప్పులు చూపించారని, రెండు రకాల అప్పులు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేదని, శ్వేతపత్రంలో స్పష్టంగా చెప్పారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన శ్వేతపత్రంలోనే గవర్నమెంట్ హామీ లేనివి, గవర్నమెంట్ కట్టనివి 59,414 కోట్లు అని చెప్పారని పేర్కొన్నారు. శాసనసభలో శనివారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం హామీ ఉండి, గవర్నమెంట్ కట్టవలసిన అవసరం లేనివి 95,462కోట్లు అని చెప్పారని అన్నారు. అంటే గవర్నమెంట్ కట్టవలసిన అవసరం లేని అప్పులు 1,54,876 కోట్లు అని, వారు చె ప్పిన 6,71,757 కోట్ల అప్పుల నుండి గవర్నమెంట్ కట్టవల్సిన అ వసరం లేని1,54,876 కోట్లను తీసేస్తే

మిగిలిన అప్పు 5,16,881 కోట్లు అని వివరించారు. రాష్ట్రం ఏర్పడే నాటికి 72,658 కోట్ల అప్పు తెలంగాణకు గత ప్రభుత్వాల నుంచి సంక్రమించిందని శ్వేతపత్రంలో చెప్పారని తెలిపారు. 5,16,881 కోట్ల ప్రభుత్వం కట్టవవలసిన అప్పు నుంచి వారసత్వంగా వచ్చిన 72,658 కోట్ల అప్పును తీసివేస్తే 4,44,223 కోట్ల అప్పు ఉంటుందని చెప్పారు. తెలంగాణ ఏర్పడక ముందు ఎస్‌పివి (స్పెషల్ పర్పస్ వెహికిల్స్)ల ద్వారా గత ప్రభుత్వాలు చేసిన అప్పు 11,609కోట్లు అని, ఈ మొత్తాన్ని కూడా 4,44,223 కోట్ల నుంచి తీసివేస్తే, 4,32,614 కోట్లు మిగులుతుందని పేర్కొన్నారు. శ్వేతపత్రంలో ఎఫ్‌ఆర్‌బిఎం అప్పులు 2024 మార్చి 31 వరకు ఉన్న బడ్జెట్ ఎస్టిమేట్స్‌ను తీసుకున్నారని తెలిపారు. శ్వేతపత్రం డిసెంబర్‌లోనే విడుదల చేశారనేది అందరికీ తెలిసిందే అని, ఈ శ్వేతపత్రంలో తెలివిగా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న 6,115 కోట్ల అప్పును బిఆర్‌ఎస్ ఖాతాలో జమ చేశారని మండిపడ్డారు.

కాంగ్రెస్ తీసుకున్న 6,115 కోట్లను, 4,32,614 నుంచి తీసివేస్తే 4,26,499 కోట్ల అప్పు మిగులుతుందని వివరించారు. తొమ్మిదిన్నరేళ్ల కాలంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 4,26,499 కోట్లు మాత్రమే అని, కానీ పదే పదే 6,71,757 కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉదయ్ అనే స్కీం తీసుకువచ్చి డిస్కంల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం టేపభుత్వం చేయాలని చట్టం చేయడం వలన 9 వేల కోట్ల రూపాయల అదనపు అప్పు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. 2019 -20 15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లను కేంద్ర ప్రభుత్వం చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పు రూపంగా తీసుకోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణ ప్రభుత్వం అనివార్యంగా 2,459 కోట్ల అప్పు తీసుకోవాల్సి వచ్చిందని, కొవిడ్ మహమ్మారి దేశ, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను అతలాకుతలం చేశాయి అనేది అందరికీ తెలిసిన సత్యమని వివరించారు. ఆ సందర్భంలో పన్ను రాబడిలు గణనీయంగా తగ్గడంతో కేంద్ర ప్రభుత్వం 2020 -21 ఆర్థిక సంవత్సరానికి జిఎస్‌డిపిలో 1.75 శాతం అధికంగా

అప్పులు చేసే వెసులుబాటు కల్పించిందని, గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలను ఆదుకోకుండా, అప్పులు తీసుకునే స్థితికి కేంద్రం నెట్టిందని చెప్పారు. అందువల్ల 17,558 కోట్ల అప్పు చేయవల్సిన అనివార్య పరిస్థితి తెలంగాణకు వచ్చిందని చెప్పారు. కొవిడ్ కారణంగా 2021- 22 సంవత్సరంలో జిఎస్‌డిపిలో 1 శాతం అధికంగా అప్పు చేయాల్సి వచ్చిందని, ఆ మొత్తం 10,784 కోట్లు అని వివరించారు. తెలంగాణ రాష్ట్రం అనివార్యంగా 41,159 కోట్ల అప్పు తీసుకోవల్సిన పరిస్థితికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, కొవిడ్ వలన నెట్టబడిందని, ఇది ఏ ప్రభుత్వమున్నా అనివార్యంగా చేయాల్సిన అప్పు అని పేర్కొన్నారు. ఈ 41,159 కోట్ల అప్పును 4,26,499 కోట్ల నుంచి తీసివేస్తే 3,85,340 కోట్లుగా తేలుతుందని చెప్పారు. తొమ్మిదిన్నరేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి, మూలధన పెట్టుబడి, సంక్షేమాల కొరకు నెట్‌గా చేసిన అప్పు 3,85,340 కోట్లు మాత్రమే అని అన్నారు.

కాళోజీ నా గొడవ ఎంత ఘోషించిందో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రతాపం చూసి పాపం కాళోజీ ఆత్మ ఎంత తల్లడిల్లిందో.. నా గొడవ ఎంత ఘోషించిందో అని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఉద్యోగాలు ఇస్తామని రాహుల్‌గాంధీ నిరుద్యోగుల వద్ద మాట్లాడారని, ప్రజాస్వామిక పాలన అని నిరుద్యోగులపై లాఠీలు జూలిపిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని మొదటి పేజీ చాప్టర్ 1, మొదటి లైన్‌లో ‘పూర్తి స్థాయి ప్రజాస్వామిక పరిపాలన’ అందిస్తామన్నారని పేర్కొన్నారు. పూర్తి ప్రజాస్వామిక పాలన అంటే ప్రజల భావ ప్రకటనా స్వేచ్చకు, నిరసన తెలియజేసే హక్కుకు హామీపడతామనే కదా..? అని ప్రశ్నించారు. కానీ వాస్తవంలో జరుగుతున్నది ఏమిటని నిలదీశారు. చదువుల తల్లి నిలయమైన సిటీ సెంట్రల్ లైబ్రరీలో పరీక్షలకోసం విద్యార్థులు చదువుకుంటూ ఉంటే, అక్రమంగా పోలీసులు చొరబడి గేట్లకు తాళాలేసి విద్యార్థులను నిర్బందించి, లాఠీలతో వీరంగం వేసి వీపులు చిట్ల గొట్టారని మండిపడ్డారు.

ఈ సంఘటన చూసి సరస్వతీ దేవి కూడా కన్నీరు పెట్టుకొని ఉంటదని వ్యాఖ్యానించారు. ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాల రచయితల ఆత్మలు ఘోషించి ఉంటాయని అన్నారు. అందులో చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి బహూకరించిన కాళోజీ ‘నా గొడవ’ పుస్తకం కూడా ఉండే ఉంటదని, రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రతాపం చూసి పాపం కాళోజీ ఆత్మ ఎంత తల్లడిల్లిందో… కాళోజీ నా గొడవ ఎంత ఘోషించిందో అని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో రైతులు ఎరువులు అడిగినందుకు లాఠీచార్జే సమాధానమని, నడిరోడ్డు మీద నిరుద్యోగులపై లాఠీలు ఝుళిపించడమేనా కాంగ్రెస్ చెప్పిన పూర్తి స్థాయి ప్రజాస్వామ్యమని వ్యాఖ్యానించారు. ఆర్ట్ కాలేజీలో జరుగుతున్న లాఠీచార్జీని చిత్రీకరిస్తున్న జర్నలిస్టును అసభ్య పదజాలంతో బూతులూ తిట్టి, కొట్టడమేనా కాంగ్రెస్ మార్కు ప్రజాస్వామ్యం..? ఇందిరమ్మ పాలననా..? అని అడిగారు. అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కితే అణచివేతనే అని, ప్రతిపక్ష కార్యకర్తలపై ప్రతీకార దాడులు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు – నిలదీసిన వారిపై దాడులు.. చివరికి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా బెదిరింపూలూ, కేసులు,జైళ్లు అని పేర్కొన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఎట్లా ఉందంటే విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలా లేదు… పోలీసులు విచ్చలవిడిగా ప్రయోగిస్తున్న లాఠీలా ఉందని చెప్పారు. ఇదేనా కాంగ్రెస్ చెప్పిన పూర్తి స్థాయి ప్రజాస్వామిక సుపరిపాలనా ముఖచిత్రం..? ప్రజల గొంతులు నొక్కేస్తూ, వీపులు వాయగొడుతూ ప్రజాపాలనఅని చెప్పుకోవడం వారికే చెల్లిందని అన్నారు. ఎంతైనా ఎమర్జెన్సీ ప్రయోగించిన ఇందిరమ్మ రాజ్యం ఎట్లాఉండాలనో గట్లే ఉన్నదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

బీర్లు, లిక్కర్ ధరలు భారీగా పెంచబోతున్నారు
రాష్ట్రంలో బీర్లు, లిక్కర్ ధరలు రాబోయే రోజుల్లో భారీగా పెంచబోతున్నట్లు బడ్జెట్ అంచనాలు పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకులు తల దించుకోవాలని విమర్శించారు. 2023 -24 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ. 19,884 కోట్ల ఆదాయాన్ని గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం పెట్టుకుంటే, 2024 -25కు గాను కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 25,617 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారని, అంటే రూ. 5,773 కోట్లు అదనంగా అంచనా వేసుకున్నారని చెప్పారు. రూ. 2,760 కోట్లుగా ఉన్న బీర్లపై డ్యూటీని రూ. 3,500 కోట్లకు పెంచారని, లిక్కర్‌పై ఉన్న డ్యూటీని రూ. 11,031 కోట్ల నుంచి రూ. 15,500 కోట్లకు పెంచారని, అంటే బీర్లు, లిక్కర్ ధరలు రాబోయే రోజుల్లో భారీగా పెంచబోతున్నట్లు స్పష్టం చేశారని తెలిపారు. 2023 -24లో ఉన్న రూ. 14,570 కోట్ల ఎక్సైజ్ వ్యాట్‌ను 2024 -25కుగాను రూ. 16,432 కోట్లుగా అంచనా వేశారన్నారు.

అంటే రూ. 2000 కోట్ల వ్యాట్‌కు సమానమైన మద్యం అమ్మకాలను పెంచబోతున్నట్లు చెప్పారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం అమ్మకాలపై రాద్దాంతం చేసిన వాళ్లే, మద్యం అమ్మకం ద్వారా రూ. 7,700 కోట్ల అధిక రాబడిని సమకూర్చుకోవాలని బడ్జెట్ అంచనాలు పొందుపరిచారని విమర్శించారు. ఎక్సైజ్, వ్యాట్ కలిపి మొత్తం 42 వేల కోట్ల 49 రూపాయలు ఎక్సైజ్ రూపంలో ఆదాయం సంపాదిస్తామని బడ్జెట్‌లో పెట్టారన్నారు. నాడు గ్రామాల్లో బెల్ట్ షాపు.. ఇప్పుడు గల్లీకో బెల్ట్ షాపు పెట్టే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ప్రజల రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసి వసూలు చేస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్పి, రూ. 42వేల కోట్ల ఆదాయం తెచ్చుకునే ప్లాన్ చేస్తున్నారని హరీశ్‌రావు అన్నారు.

బడే భాయి బాటలోనే: మైనార్టీల సంక్షేమం విషయంలో బడే బాయ్ తరహాలోనే చోటా బాయ్ కూడా వ్యవహరిస్తున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మంత్రి వర్గంలో మైనార్టీలకు ఒక్క మంత్రి పదవి, ఎంఎల్‌సి ఇవ్వలేదని ఆయన ఆక్షేపించారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అన్నారని, బేషజాలకు పోకుండా హామీలు అమలు చేయాలి స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో శాంత్రిభద్రతల సమస్యలు ఉన్నాయని, గడిచిన 8 నెలల్లో నగరంలో 500 హత్యలు, 1800 రేప్ కేసులు నమోదయ్యయని చెప్పారు. ఇలాంటి ఘటనలతో హైదరాబాద్ నగర ప్రతిష్ఠ దెబ్బతింటుందని తెలిపారు. ఆరు గ్యారంటీల పేరుతో రాహుల్ గాంధీ పరువు తీశారని, సోనియా ప్రతిష్టను దిగజార్చారని విమర్శించారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత అన్నారని, కానీ బడ్జెట్‌లో గ్యారంటీలకు, ఓటాన్ అకౌంట్ కంటే తక్కువ కేటాయించారని అన్నారు. ప్రభుత్వం గ్యారంటీలు హామీలు అమలు చేయలేదని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని- హరీశ్‌రావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News