ఏటా 20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇస్తామని ఎన్నికల సమయంలో ఊదరగొట్టారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ తీరు చేసింది గోరంత, చెప్పుకునేది కొండంత అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇచ్చిన సమాధానం ప్రకారం, సుమారు రూ. 5 వేల కోట్ల వడ్డీ లేని రుణాల బకాయి ఉందని, బకాయిలే చెల్లించని కాంగ్రెస్ ప్రభుత్వం, ఐదేళ్లలో లక్ష కోట్ల రుణాలు ఎలా ఇస్తుంది..? అని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు వల్ల మహిళలు కోటీశ్వరులు కాదు, అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చిందని అన్నారు. మహిళలకు ప్రతి నెలా రూ. 2500 ఇస్తామని ఆరు గ్యారెంటీల్లో మొట్ట మొదటి హామీగా చెప్పి ఏడాదిన్నరగా అమలు చేయని రేవంత్ సర్కారు, ఇప్పుడు ఇందిరా మహిళా శక్తి పేరిట వేడుకలు నిర్వహించడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు.
మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని ప్రతి మహిళకు బకాయి పడ్డ రూ. 37,500 ఎప్పుడు చెల్లిస్తారని నిలదీశారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే, చేతలు మాత్రం గడప దాటవు అని మరోసారి నిరూపితమైందని విమర్శించారు. గ్యారెంటీలు, 420 హామీలు అని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లే రేవంతు సర్కారు, మహిళలను దారుణంగా వంచించిందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, కెసిఆర్ మహిళా సంక్షేమం, సాధికారత, స్వయం సమృద్ధి కోసం ప్రారంభించిన పథకాలకు మంగళం పాడారని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో…కెసిఆర్ కిట్టు బంద్ అయ్యింది, కెసిఆర్ న్యూట్రీషన్ కిట్ బంద్ అయ్యింది, బతుకమ్మ చీరెలు బంద్ అయ్యాయి,ఆరోగ్య లక్ష్మి బంద్ అయ్యింది..ఆరోగ్య మహిళ బంద్ అయ్యింది..పింఛన్ల పెంపు బంద్ అయ్యింది..కడుపు కోతలు మల్లా పెరిగినయి, పెరిగిన క్రైం రేటుతో ఆడబిడ్డలకు భద్రత కరువైంది..నోటిఫికేషన్లు రాక, యువతుల ఉద్యోగ కలల సాకారం ప్రశ్నార్థకమైందని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి అమలు చేయకుండా ఇన్నాళ్లూ కాలం వెల్లదీసారు.
.ఇప్పుడమో అన్నీ చేసినట్లు, మహిళలను కోటీశ్వరులను చేసినట్లు కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం, అధికారంలోకి వచ్చాక అబద్దాలు ప్రచారం చేసుకుంటం అన్నట్లుంది కాంగ్రెస్ వైఖరి అని వ్యాఖ్యానించారు. అభయహస్తం మేనిఫెస్టోలో చెప్పి, ఏడాదిన్నరగా మాట తప్పిన హామీలను గుర్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి నిజంగా మహిళల పట్ల గౌరవం ఉంటే, వారి సంక్షేమం పట్ల చిత్తశుద్ది ఉంటే నేడు జరిగే ఇందిరా మహిళా శక్తి వేడుకల్లో హామీల అమలుకు కచ్చితమైన తేదీలను ప్రకటించాలని అన్నారు. ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ చేసిన మోసానికి గాను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగే మహిళా దినోత్సవ వేడుకల్లో యావత్ కాంగ్రెస్ పార్టీ తరుపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.