Monday, December 23, 2024

వాళ్లపై అభాండాలు మోపడం కాదు… పాలనపై రేవంత్ దృష్టి పెట్టాలి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కరెంట్ కోతల విషయంలో సిఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతి పక్షాలు, విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. విద్యుత్ రంగ వైఫల్యాలకు తానే బాద్యుడిని అన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని, ఆయన వైఖరి ఆడ రాక పాత గజ్జెలు అనే సామెతను గుర్తుకు వస్తుందన్నారు. బుధవారం హరీష్ రావు సోషల్ మీడియాలో స్పందించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల సహకారంతో 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు పటిష్ఠమైన వ్యవస్థను నిర్మించిందని, రెప్పపాటు కాలం కూడా కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపిందని ప్రశంసించారు. కేవలం 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను కుప్ప కూల్చిందని దుయ్యబట్టారు. గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు సరిపోయే విద్యుత్ సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందని, తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణ చేయడం సరికాదని హరీష్ రావు సూచించారు.

తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ పునర్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన విద్యుత్ ఉద్యోగులను చీటికి మాటికి నిందించడం, చర్యలు తీసుకోవడం వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమేనని ఘాటుగా విమర్శలు గుప్పించారు. విద్యుత్ ఉద్యోగులపై నెపం నెట్టడమే తప్ప కరెంటు కోతలను ఎలా సరిదిద్దాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరమైన విషయమని, సిఎం ఇలాంటి చిల్లర మల్లర చేష్టలు మాని కెసిఆర్ హయాంలో రెప్పపాటు కూడా పోని విధంగా 24 గంటల విద్యుత్ ను ఇచ్చినట్టుగా అన్ని రంగాలకు సరఫరా చేస్తే మంచిదన్నారు. ఆయన లాగే అందరూ కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతారని సిఎం భ్రమల్లో ఉంటున్నారని, వాటిని వీడి పాలనపై దృష్టి పెడితే మంచిదని హరీష్ రావు చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News