Sunday, November 17, 2024

రుణమాఫీ లేదు కానీ రైతులతో రణం చేస్తున్నారు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

ప్రజలను శిక్షించవద్దని ఆ భగవంతుని వేడుకున్నా: హరీష్ రావు

రైతులందరికీ రుణమాఫీ పూర్తి అయ్యే వరకు మా పోరాటం ఆగదు..

రైతు రుణ మాఫీపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి..

యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాజీ మంత్రి హరీష్ రావు

మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని, వెంటనే రైతుల రుణ మాఫీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బిఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాదగిరిగుట్ట లోని హరిత టూరిజం హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అక్రమ కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. రైతుల రుణం మాఫీ చేయకుండా రైతులతో రణం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి రైతుకు రుణ మాఫీ జరిగేంతవరకు రైతులకు అండగా ఉంటామన్నారు. పోలీసులు కూడా చట్టానికి లోబడి పనిచేయాలన్నారు. ఆరు గ్యారంటీ పథకాలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో రైతు రుణ మాఫీ పేరుతో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగి మోసం చేశారని మండిపడ్డారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పాపం చేసి ముఖ్యమంత్రి పదవి సొంతం చేసుకున్నారని, రేవంత్ పాపం చేస్తే.. దేవుడు ప్రజలను శిక్షించవద్దని, శ్రీ లక్ష్మి నరసింహ స్వామీని వేడుకున్నామని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి దైవ ద్రోహానికి పాల్పడ్డారని, సీఎం ఒకలా, మంత్రులు మరోలా రుణమాఫీపై ప్రకటనలు చేయడం వాళ్ళ చిత్తశుద్ధికి నిదర్శనమని చురకలంటించారు. రైతు రుణ మాఫీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిఎం రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని, దేవుళ్ల దగ్గర ప్రాయశ్చిత్తం  చేసుకోవాలన్నారు. అన్ని రకాల వడ్లకు బొనస్, రైతు భరోసా వచ్చేంత వరకు.. రైతు రుణమాఫీ పూర్తి అయ్యే వరకు మా పోరాటం ఆగదన్నారు. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు బేషరతుగా 2 లక్షలు చెల్లించాలన్నారు. రైతు రుణమాఫీ పూర్తిగా చేసే వరకు సిఎం ప్రమాణం చేసిన అన్ని ఆలయాలకు, చర్చలకు వెళ్తామని హెచ్చరించారు. రైతులందరికీ రుణమాఫీ జరిగేవరకు మా పోరాటం ఆగదని రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News