హైదరాబాద్: పేదలకు ఒక న్యాయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడికి ఒక న్యాయామా? అని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో హైడ్రా బాధితులతో బిఆర్ఎస్ ఎంఎల్ఎలు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. బిఆర్ఎస్ తరపున బాధితులకు లీగల్ గా అండగా ఉంటామని, సిఎం రేవంత్ రెడ్డి ప్రజలకు మంచి చేసే పనులు చేయాలని, మూసీలో గోదావరి నీళ్లు కాదు అని, పేదల కన్నీళ్లు కారుస్తున్నావని, కాంగ్రెస్ కు కూల్చడం తప్ప కట్టడం తెలియదని దుయ్యబట్టారు.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలనతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి అఖిలపక్షం ఏర్పాటు చేయాలని, ఆ తరువాతనే మూసీ ప్రక్షాళనపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి అనేది పేదలకు మేలు చేసేలా ఉండాలని, పేదల ప్రాణాలు తీసి కంపెనీలు కడుతావా? అంటూ మండిపడ్డారు. పేదలకు రక్షణ కవచంలా ఉంటామని, పేద ప్రజల ఉసురు రేవంత్ రెడ్డికి పక్కగా తగులుతుందని శాపనార్థాలు పెట్టారు.