డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం రాజకీయ ప్రసంగం లాగా ఉందని, బడ్జెట్‌లో పచ్చి అబద్దాలు, అసత్యాలు ఉన్నాయని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు విమర్శించారు. భట్టి బడ్జెట్ బడా జూట్ బడ్జెట్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ తన విశ్వసనీయతను కోల్పోయిందని అన్నారు. ఈ బడ్జెట్‌లో అబద్ధాలు, అతిశయోక్తులు తప్ప ఏమి లేవని పేర్కొన్నారు. ఎన్నికల ముందు అన్ని చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే ఏమి చెయ్యమనే మాదిరి ఈ బడ్జెట్ ప్రసంగం ఉన్నదని ఆరోపించారు. ఎన్నికల ముందు ఏం అడిగితే అది ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. శాసనసభలో బుధవారం డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అసెంబ్లీ మీడియా హాలులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలతో కలిసి హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు.
సిఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో, అసెంబ్లీ బయట అబద్ధాలే మాట్లాడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా మహిళలందర్ని ప్రభుత్వం మోసం చేసిందని మండపడ్డారు. స్కూల్ విద్యార్థుల డ్రెస్ కుట్టు చార్జీలు 75 ఇస్తున్నాం అంటున్నారని, గత బడ్జెట్‌లోనూ ఇదే చెప్పారని చెప్పారు. మక్కీకి మక్కీ కాపీ కొట్టారని విమర్శించారు. ఈ ప్రభుత్వం నిజంగా ఇస్తున్నది 50 రూపాయలు మాత్రమే అని పేర్కొన్నారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని బడ్జెట్‌లో చెప్పారని, కానీ బిఆర్‌ఎస్ 6లక్షల 47వేల రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పారు. బడ్జెట్ ప్రసంగం అంతా అరచేతిలో వైకుంఠం, ఆద్యాంతం అబద్దాలు అని విమర్శించారు. 72 పేజీల భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో రెండు పేజీలు పెరిగింది తప్ప, పేదల సంక్షేమం పెరగలేదని విమర్శించారు. ఇది అన్ రియలస్టిక్ బడ్జెట్ అని, ఈ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ తన విశ్వసనీయతను కోల్పోయిందని పేర్కొన్నారు.