హైదరాబాద్: మృత్యువుతో పోరాడుతూ డాక్టర్ ప్రీతి తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్య బృందం నిర్విరామంగా, శక్తి వంచన లేకుండా శ్రమించారని అన్నారు.ప్రీతి పూర్తి అరోగ్యవంతురాలై వస్తుందని అనుకున్న డాక్టర్ ప్రీతి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం నా మనసును తీవ్రంగా కలిచి వేసిందని విచారం వ్యక్తం చేశారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.ప్రీతి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
మంత్రుల సంతాపం
మెడికో ప్రీతి మృత్యువుతో పోరాడి మరణించిన ఘటన దురదృష్టకరమని, వైద్యుల ప్రయత్నాలు విఫలమవడం బాధ కలిగిస్తుందని మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ అన్నారు. ప్రీతి మరణం పట్ల నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రేవంత్ రెడ్డి సంతాపం
గిరిజన వైద్య విద్యార్థి ఎంతో గొప్ప భవిష్యత్ ఉన్న ప్రీతి ఆత్మహత్య అత్యంత బాధాకరమని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ప్రీతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రీతి మరణానికి అన్ని కోణాలలో విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.