Thursday, January 23, 2025

కిషన్‌రెడ్డికి కన్ఫ్యూషన్ ఎక్కువ..కాన్సన్ట్రేషన్ తక్కువ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : -కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కన్ఫ్యూషన్ ఎక్కువ ..కాన్సన్ట్రేషన్ తక్కువ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి విమర్శించారు. ఫ్రస్ట్రేషన్‌తో పట్టపగలు పచ్చి అబద్దాలతో పవర్ పాయింట్ ప్రెసంటేషన్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా గతంలో చెప్పిన అబద్ధాలనే కిషన్‌రెడ్డి రిపీట్ చేసిండు తప్ప పనికొచ్చేది ఒక్కటీ మాట్లాడలేదని అన్నారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రానికి ఇచ్చే రుణాలు, ప్రజలకు బ్యాంకులు ఇచ్చిన వ్యక్తిగత రుణాలను కూడా కిషన్‌రెడ్డి కేంద్రం ఖాతాలో వేసుకోవడానికి సిగ్గుండాలని ఘాటుగా విమర్శించారు. జన్‌ధన్ ఖాతాలు ప్రారంభించిన వాటిలో 50 శాతానికిపైగా మనుగడలో లేవన్న సంగతి కిషన్‌రెడ్డికి తెలియదా..? అని ప్రశ్నించారు. పన్నుల పంపిణీ అనేది రాష్ట్రాల రాజ్యాంగ హక్కు అని, పన్నుల పంపిణీ భారతదేశం కన్సాలిడేటెడ్ ఫండ్‌లో భాగం కాదని వివరించారు.

ఫైనాన్స్ కమిషన్ సిఫారసు చేసిన కేంద్ర పన్నుల్లో అన్ని రాష్ట్రాల వాటా 41 శాతం ఉన్నప్పటికీ, రాష్ట్రాలు కేంద్ర పన్నుల్లో దాదాపు 30 శాతం మాత్రమే పొందుతున్నాయని తెలిపారు. కేంద్రం పన్నుల భాగస్వామ్య పూల్‌లో భాగం కాని సెస్సులు, సర్‌చార్జీలు విధించడం వల్లనే ఇలా జరుగుతుందని చెప్పారు. పన్నుల పంపిణీలో తెలంగాణ వాటా 2014 -15లో 2.893 శాతం ఉండగా, 2021 -22 నాటికి 2.102 శాతానికి తగ్గిందన్నారు. కేంద్ర వాటాగా రూ.1588.08 కోట్లతో తెలంగాణలో 100 శాతం ఇళ్లకు నల్లాల ద్వారా నీటిని సరఫరా చేశామని కిషన్‌రెడ్డి అన్నారని, నిజానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. మిషన్ భగీరథ కింద రూ 36,000 కోట్లు వెచ్చించి 100 శాతం గృహాలకు నీటి సరఫరా చేసిందని వివరించారు. కేంద్రం ఇస్తున్న మొత్తం మిషన్ భగీరథ నిర్వహణకు కూడా సరిపోదని పేర్కొన్నారు. ఇంత పచ్చిగా కిషన్‌రెడ్డి అబద్దాలు ప్రచారం చేస్తారా అని నిలదీశారు.

రాబడి ,వ్యయ ప్రవాహాల మధ్య అసమతుల్యతలను అధిగమించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్వారా అన్ని రాష్ట్రాలకు అందించబడిన స్వల్పకాలిక సదుపాయమే మార్గాలు, సాధనాలు(వేస్ అండ్ మీన్స్) అని, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పించే సదుపాయమని వ్యాఖ్యానించారు. ఈ అడ్వాన్సులపై రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 6 శాతం వడ్డీ రేటును చెల్లించాలని, కేవలం తెలంగాణకే ప్రత్యేకంగా ఆర్‌బిఐ ఎదో చేస్తున్నట్టు కిషన్‌రెడ్డి చెప్పడం విడ్డూరమని విమర్శించారు.
కిషన్‌రెడ్డి మెహర్భానీతో తెలంగాణకు కేటయించిన నిధులు రాలేదు
తెలంగాణ నుంచి 2017 -18 నుండి 2022 -23 వరకు జిఎస్‌టి పరిహారం సెస్‌గా రూ.34,737 కోట్లు వసూలు చేయబడ్డాయని, కానీ తెలంగాణకు దక్కింది కేవలం రూ. 8,927 కోట్లు మాత్రమే అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. జిఎస్‌టి ప్రవేశపెట్టిన మొదటి రెండేళ్లలో పరిహారంగా వచ్చింది 169 కోట్ల రూపాయలు మాత్రమే అని అన్నారు. ఈ రెండేళ్లలో తెలంగాణ నుంచి వసూలైన జిఎస్‌టి సెస్ రూ. 10,285 కోట్లు అని, పరిహారం మొత్తం భారత కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి రాలేదు కానీ,జిఎస్‌టి పరిహార నిధి నుంచి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టి పరిహారం చెల్లించిందన్న వాదన సరికాదని, అది తమ హక్కు అని స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94(2) ప్రకారం 5 సంవత్సరాల కాలానికి వెనుక బడిన జిల్లాల అభివృద్ధికి రూ.2,250 కోట్లు విడుదల చేయబడ్డాయని,

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని చట్ట ప్రకారం ఉన్నా 2019 -20, 2020 -21, 2022 -23 సంవత్సరాలకు ఎటువంటి మొత్తం విడుదల కాలేదని చెప్పారు. కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించి తమ పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఈ మూడేళ్లకు గాను రూ. 1350 కోట్లు ఎలాంటి కారణం లేకుండా నిలుపుదల చేశారని తెలిపారు. దీనికి కిషన్‌రెడ్డి ఏం సమాధానం చెబుతారు..? అని ప్రశ్నించారు. జాతీయ రహదారులకు కేటాయింపులు రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్‌ల నుండి జరుగుతాయని, కేంద్ర ప్రభుత్వంపై అదనంగా పడే భారం ఏమీ లేదని అన్నారు. తెలంగాణకు కేటయించిన నిధులు కిషన్‌రెడ్డి మెహర్భానీతో రాలేదని తెలిపారు.
రైతులకు కాకుండా తెలంగాణలో ఉన్న ఎరువుల కంపెనీలకు ఇస్తున్నారు
రాష్ట్రం నుంచి ఆహార ధాన్యాల సేకరణకు కేంద్ర ప్రభుత్వం రూ 1.58 లక్షల కోట్లు ఖర్చు చేసిందని కిషన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని మంత్రి వ్యాఖ్యానించారు. వాస్తవానికి, ఈ ఖర్చులో ఎక్కువ భాగం పిడిఎస్ కింద ఈ ఆహార ధాన్యాల విక్రయం ద్వారా తిరిగి కేంద్రం తిరిగి రాబట్టు కుంటుందని చెప్పారు. అయినా యాసంగిలో ధాన్యం కొనుగోలుకు రైతులను కేంద్రం అరిగోస పెట్టిన విషయాన్ని ఎవరు మరచిపోతారు..?అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర ప్రజలను నూకలు తినాలని ఉచిత సలహా ఇచ్చి అవహేళన చేయలేదా…? అని నిలదీశారు. రాష్ట్రానికి ఎరువుల సబ్సిడీ రూ. 33వేల కోట్లు ఇస్తున్నట్టు కిషన్‌రెడ్డి చెబుతున్నారని,

గత ప్రభుత్వాలు ఈ సబ్సిడీ ఇవ్వలేదా..? అని అడిగారు. ఈ రాయితీని తెలంగాణలోని రైతులకు కాకుండా తెలంగాణలో ఉన్న ఎరువుల కంపెనీలకు ఇస్తున్నారని, ఎరువుల కంపెనీకి ఇచ్చే సబ్సిడీని తెలంగాణ రైతులకు ఇచ్చే సబ్సిడీగా ఎలా పరిగణిస్తారు..? అని ప్రశ్నించారు. ఆర్‌బిఐ అనేది స్వతంత్ర సంస్థ అని, ఓవర్‌డ్రాఫ్ట్ ఇతర ఆర్థిక విషయాల్లో రిజర్వ్‌బ్యాంకు కొన్ని వెసులు బాట్లు ఇవ్వడం సహజం అని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే కొన్నిసార్లు మనకు ఇచ్చారని చెప్పారు. ఏ వెసలుబాటు ఇచ్చినా దానికి వడ్డీ కూడా ఆర్‌బిఐ వసూలు చేస్తుందని, దీంట్లో బిజెపి గొప్పతనం ఏముందని అన్నారు.
కిషన్‌రెడ్డి లేని గొప్పలు చెప్పుకోవడానికి తిప్పలు పడుతున్నారు
ఆర్‌బిఐ స్వతంత్ర సంస్థ కాదు కేంద్రం చెప్పు చేతల్లో ఉండే సంస్థ అని కిషన్‌రెడ్డి చెప్పదలుచుకున్నారా..? అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ పౌరులకు బ్యాంకులు లోన్లు ఇవ్వాలా..? వద్దా..? అనేది బిజెపి చెబితే జరుగుతుందా.? అని అడిగారు. రకరకాల నిబంధనల ప్రకారమే బ్యాంకులు రుణాలు ఇస్తాయని,ఇందులో కేంద్ర ప్రభుత్వ గొప్పతనం ఏముందని అన్నారు. కిషన్‌రెడ్డి లేని గొప్పలు చెప్పుకోవడానికి తిప్పలు పడుతున్నారని ఎద్దేవా చేశారు.విభజన చట్టం హమీలు ఎందుకు నెరవేర్చరో కిషన్‌రెడ్డి ఎందుకు చెప్పరని పేర్కొన్నారు.

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వరు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైందని, బీబీనగర్ ఎయిమ్స్‌కు నామమాత్రంగా నిధులు విడుదల చేసి నత్త కూడా సిగ్గు పడేలా పనులు జరుగుతుంటే కిషన్ రెడ్డి కేంద్రం గొప్పతనమని చెప్పుకుంటారా..? అని ఎద్దేవా చేశారు. ఆయుష్మాన్ కింద ఇచ్చేది గోరంత ఆరోగ్య శ్రీ కింద తామిచ్చేది కొండంత అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News