Wednesday, January 22, 2025

వచ్చి చూస్తే తెలుస్తుంది

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సంగారెడ్డి : తెలంగాణలో ఏముందని ప్రశ్నించిన ఎపి మంత్రికి ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖా మంత్రి హరీశ్‌రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా ఆంథోల్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం నాడు హరీశ్‌రావు పర్యటించారు. సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ఎపిలో నిజంగా ఏముందో చెప్పాలన్నారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినప్పటికీ ఎవరూ మాట్లాడడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కును తుక్కు తుక్కు కింద పెట్టినా మాట్లాడలేని పరిస్థితి ఎపిలో ఉందన్నారు. ఎపిలో అక్కడి అధికార పార్టీ అడగడం లేదని, ప్రతిపక్ష పార్టీ కూడా పట్టించుకోదని, ప్రశ్నించడం లేదని హరీశ్‌రావు మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు కూడా జనాలను గాలికి వదిలేసి అధికారం కోసం ఆరాటపడుతున్నాయని విమర్శించారు. అనవసరంగా తెలంగాణా జోలికి రావద్దు… మా గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే మీకు అంత మంచిది కాదు..అని హితవు పలికారు. 56 లక్ష ల ఎకరాల్లో వరి పంట ఉందని, బోరు బావుల వ ద్ద 24 గంటల కరెంటు ఉందని, ఎపి మంత్రులు వచ్చి చూస్తే తెలుస్తుందని అన్నారు.

కెసిఆర్ కిట్ ఉంది. కళ్యాణలక్ష్మి ఉంది, ఎకరానికి రూ.10 వేలు ఇచ్చే రైతు బంధు ఉంది అని ఆయనన్నారు. కాంగ్రెస్ నుంచి ఈ నియోజకవర్గంలో డిప్యూటీ సిఎం ఉన్నప్పటికీ ఒరిగిందేమీ లేదని అన్నారు. సింగూరు ప్రాజెక్టు పూర్తి కాలేదని అన్నారు. సిఎం కెసిఆర్ వచ్చిన తర్వాతనే సింగూరు ప్రాజెక్టు పూర్తి కావడంతో పాటు కాలువ పనులన్నీ పూర్తయి రెండు పంటలను రైతులు పండిస్తున్నారని అన్నారు.ఈ రోజు రైతు స్వయంగా వచ్చి నీళ్లు, కరెంటు పుష్కలంగా ఉన్నాయని చెబుతుంటే నా కడుపు నిండిపోయిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి బాగా జరిగింది. ఆ పార్టీకి ఓటేస్తే తిరిగి అదే అవినీతి పునరావృతం అవుతుందని పేర్కొన్నారు.ఎంపి బిబి పాటిల్, జడ్‌పి చైర్‌పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతికిరణ్, జిల్లా కలెక్టర్ శరత్, అదనపు జెసి వీరారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, స్థానిక నేతలు పాల్గొన్నారు. డబుల్ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించడంతో పాటు ఆకస్మికంగా బస్టాండ్‌ను మంత్రి తనిఖీ చేశారు. అనంతరం సాయంత్రం జరిగిన ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొన్నారు. మైనార్టీల సంక్షేమానికి సిఎం కెసిఆర్ కట్టు బడి ఉన్నారని, అనేక సంక్షేమ పథకాలను వారి కోసం అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News