సిఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలని బిఆర్‌ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారం చేసినందుకు, గోబెల్స్ ప్రచారం చేసినందుకు సిఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటిసులు ఇచ్చారని తెలిపారు. ఇలాగే తప్పుడు ప్రచారం చేసినందుకు అస్సాంలో ఒకరిని అరెస్టు చేశారని, సిఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్‌ను అరెస్టు చేయకుంటే మోడీ, రేవంత్ ఇద్దరు కలిసినట్టే…ఇద్దరి దోస్తాన బయట పడ్డట్టే అని వ్యాఖ్యానించారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో బిఆర్‌ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో హరీశ్ రావు మాట్లాడుతూ, గత అసెంబ్లీలో ఎన్నికల్లో సైతం బిఆర్‌ఎస్‌పై తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. గులాబి జెండా ఉండగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ వచ్చాక అనేక సమస్యలు వచ్చాయని అన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.