సిద్ధిపేట: ఆపదలో ఉన్న వారికి, కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయాలన్నదే తన తాపాత్రయని, ముఖ్యమంత్రి సహాయనిధి నిరు పేదలకు సంజీవనిలా ఓ వరమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం ఉదయం సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 31 మంది లబ్ధిదారులకు రూ.12,09,500 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్ద ఆపరేషన్ అవసరం ఉంటే నిమ్స్ ఆసుపత్రిలో ఖర్చులు లేకుండా ఎల్ఓసీ ఇప్పించగలుతామని, అత్యవసర వైద్యంపై సిద్ధిపేటలో రాము, హైదరాబాదులో కృష్ణారెడ్డిలు అందుబాటులో ఉంటారని, అత్యవసరమైతే తానే స్వయంగా మాట్లాడుతున్నానని చెప్పారు. సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రికి రోగితో కలిసి వచ్చిన బంధువులకు ఉచితంగా వేడివేడి అన్నం కడుపునిండా పెడుతున్నామని తెలిపారు.
ప్రయివేట్ దవాఖానకు పోయి డబ్బులు వృథా చేసుకోవద్దని, ప్రభుత్వ ఆసుపత్రిలో డయాగ్నోస్టిక్, సిటీ స్కాన్ కేంద్రాలు, ఒక్క పైసా ఖర్చు లేకుండా డయాలసిస్ యూనిట్ కేంద్రం, బొక్కలు, కండ్లు, పండ్ల డాక్టర్లు అందుబాటులో ఉన్నారని చెప్పారు. నిరుపేదలు సాయం పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తున్నదని చెప్పడానికి సిద్ధిపేట నియోజకవర్గమే నిదర్శనమని మంత్రి అన్నారు. చెక్కులను వెంటనే తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ మేరకు పట్టణంలో 8 మందికి 3 లక్షల 46 వేలు, సిద్ధిపేట రూరల్ మండలంలో ముగ్గురికి రూ.1,37,500, సిద్ధిపేట అర్బన్ మండలంలో ఒక్కరికి రూ.15 వేలు, చిన్నకోడూర్ మండలంలో 8 మందికి రూ.3,10,500, నంగునూరు మండలంలో 5 మందికి రూ.1,65000, నారాయణరావుపేట మండలంలో 4 మందికి రూ.1,15,500 చొప్పున మొత్తం 31 మందికి రూ.12,09,500 అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
Harish Rao distributes CMRF Cheques to poor in Siddipet