హైదరాబాద్: సిఎం కెసిఆర్ ఇంటి పెద్ద కొడుకులా రూ. 2016 ఆసరా పింఛన్ ఇచ్చి మీ గౌరవం పెంచారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… సీఎం కేసిఆర్ ఇంటి పెద్దకొడుకులా రూ.2016 పెన్షన్ ఇచ్చి మీ గౌరవం పెంచారన్నారు. టిడిపి హయాంలో కేవలం రూ.50 రూపాయలు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.200 పెన్షన్ ఇచ్చేదనీ, కానీ సిఎం కెసిఆర్ వచ్చాక రూ.2016 పింఛన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు చేయడం లేదని స్పష్టం చేశారు.
పేద ప్రజల సౌకర్యార్థం చాలా రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసిఆర్ ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడం పనిగా కేంద్ర బీజేపీ పని పెట్టుకుందని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎక్కడ సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని మంత్రి ఎద్దేవా చేశారు. ఎయిమ్స్ కోసం స్థలం, కోట్లాది రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే.. మీరు ఇప్పటికీ ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. బీజేపీ నాయకులు నడ్డా అబద్ధాలు మాట్లాడడం తప్ప పని చేయడం లేదని మంత్రి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు కేంద్ర బీజేపీ తామే ఇచ్చామని చెప్పుకునే బీజేపీ మీ గుజరాత్ లో ఎందుకు ఇవ్వడం లేదని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నిరుపేదకు ఎదో ఒక సంక్షేమ పథకం అందుతున్నదని మంత్రి వెల్లడించారు. తిన్న రేవు తలవాలని పెద్దలు అంటారని.. మరీ మనకు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్న కేసిఆర్ కు కృతజ్ఞత చూపాలని మంత్రి హరీశ్ ప్రజలను కోరారు.