సిద్దిపేట: సోమవారం వేకువ జామున మునుపెన్నడూ లేని విధంగా సిద్దిపేట జిల్లా లో 4 గంటల్లో 13 సెంటీ మీటర్ల వర్షపాతం కురిసిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. చిన్న కోడూరు మండలం మల్లారం గ్రామంలోని హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై సివరేజి బోర్డ్ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ లో నీట మునిగిన పంప్ హౌజ్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. కుండపోత వర్షంతో ఉధృతమైన వరద నీరు రావడంతో చిన్న కోడూరు మండలం మల్లారం గ్రామంలోని హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై సివరేజి బోర్డ్ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ లోని 6.6 కెవి పంప్ హౌజ్ నీట మునిగిందన్నారు.
పంప్ హౌజ్ నీట మునకతో హైదారాబాద్ తో పాటు సిద్దిపేట, జనగాం, భువనగిరి, మేడ్చల్ పరిధిలోని 1950 హబిటేషన్ లకు త్రాగునీటి సరఫరా కు అంతరాయం కలగనుందన్నారు. హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై సివరేజి బోర్డ్ ఎండి దాన కిషోర్ నేతృత్వంలో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నామని వివరించారు. 1 నుంచి 2 రోజుల్లో తాత్కాలిక ప్రాతిపదికన రిస్టోరేషన్ చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
2 నుంచి 3 రోజుల్లో శాశ్వత ప్రాతిపదికన ప్రాతిపదికన రిస్టోరేషన్ చర్యలు చేపడతామని, పూర్తి స్థాయిలో త్రాగు నీటి పంపింగ్ చేపడుతామన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దూర దృష్టి తో రింగ్ మెయిన్ ఏర్పాటు చేయడం వల్ల హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ సరఫరా అంతరాయం లేకుండా చూస్తున్నామన్నారు. పంప్ హౌజ్ నీట మునకతో మల్లారం ట్రీట్ మెంట్ ప్లాంట్ ద్వారా త్రాగునీటి సరఫరాలో ఎదురయ్యే తాత్కాలిక అడ్డంకులను అధిగమించేందుకు హిమాయత్ సాగర్, గండి పేట, ఉస్మాన్ సాగర్, సింగూరు నుంచి హైదారాబాద్ కు త్రాగునీటి సరఫరా పెంచుతామని హరీష్ రావు వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపడుతామన్నారు.