ఎపికి అడ్డగోలుగా తరలించుకుపోతూ
తెలంగాణ భూములను ఎండబెడుతున్నారు
ఆయనకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ
ప్రాజెక్టులకు అభ్యంతరం లేదని లేఖ
రాయాలి : మాజీ మంత్రి హరీశ్‌రావు
మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : ఆంధ్రప్రదే శ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలంగాణపై ఏమాత్రం ప్రేమ ఉన్నా రాష్ట్రంలో నిర్మిస్తున్న సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్, వార్ధా సా గర్, కాళేశ్వరం మూడో టిఎంసి ప్రాజెక్టులకు తాము అనుకూలమని చెబుతూ కేంద్ర ప్రభు త్వం ద్వారా అనుమతులు ఇప్పించాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని తన క్యాం పు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్ర తనకు రెండు కండ్ల లాంటివ ని, ఈ రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరగడ మే తన ముఖ్య లక్ష్యం అని చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బాబు చేసిన ఈ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఒకవేళ చంద్రబాబుకు తెలంగాణపై ప్రే మ ఉంటే గతంలో కెసిఆర్ హయాంలో నిర్మించి న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి వెంటనే అ నుమతులు రద్దు చేసి పనులను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి డజన్ల కొద్ద్దీ లేఖలు రాశారని గుర్తు చేశారు. ఇప్పుడేమో కాళేశ్వరం ప్రా జెక్టును వ్యతిరేకించలేదని, సముద్రంలో కలిసే నీటిని తీసుకు వెళుతున్నానని మాట్లాడడంలో అర్ధం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేతకానితనం వల్ల, కేంద్రంలో ఉన్న బిజెపి పక్షపాత ధోరణితో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు.
చంద్రబాబుకు రెండు రాష్ట్రాలు రెండు కండ్లలాగా కనపడితే నాగార్జునసాగర్ ఎడమ కాలువను ఎండబెట్టి సాగర్ కుడి కాలువ నుంచి నిండుగా నీళ్లను తీసుకుపోవడం ఏమిటన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి సైతం రోజుకు రెండు టిఎంసిల నీళ్లు తీసుకుపోతున్నారని, దీంతో హైదరాబాద్‌కు తాగునీటి సమస్యతోపాటు సాగర్ ఎడమ కాలువ కింద పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు గతంలో దత్తత తీసుకున్న మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, బీమా కింద కూడా పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణకు 343 టిఎంసిల నీరు రావాల్సి ఉండగా కేవలం 220 టిఎంసిలు మాత్రమే వచ్చిందన్నారు. చంద్రబాబు అంటున్న సమన్యాయం తెలంగాణకు మాటల్లో ఉంది తప్ప ఆంధ్రకు మాత్రమే చేతల్లో ఉందని అన్నారు. తెలంగాణ విషయంలో చంద్రబాబుది పక్షపాత ధోరణి అని మండిపడ్డారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ద్వారా సముద్రంలో కలిసే నీళ్లు తీసుకెళ్తే తప్పేంటి అని చంద్రబాబు మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు.
కృష్ణానది విషయంలో సైతం అదే జరిగిందని, పెన్నా బేసిన్ లో ప్రాజెక్టులు కట్టి నది పరివాహక ప్రాంతం బయట కృష్ణ జలాలు వాడుతున్నారని అన్నారు. బనకచర్ల ద్వారా 200 టిఎంసిలను గోదావరి పెన్నా బేసిన్‌కు తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బచావత్ ట్రిబ్యునల్ గోదావరిలో 1480 టిఎంసిలను ఉమ్మడి ఎపికి కేటాయించిందని అప్పటి కాలంలోనే ప్రభుత్వ జీవోల ప్రకారం తెలంగాణకు 968 టిఎంసిలు కేటాయించారని గుర్తు చేశారు. కానీ వాడకంలో ఎప్పుడూ తెలంగాణలో 200 టిఎంసిలు దాటలేదన్నారు. అందుకే అప్పటి సిఎం కెసిఆర్ గోదావరి నదిని సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో 240 టిఎంసిలతో కాళేశ్వరం ప్రాజెక్టు, 47 టిఎంసిలతో సమ్మక్క సాగర్, 65 టిఎంసిలతో సీతక్క సాగర్, 12 టిఎంసిలతో వార్ధా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని గుర్తు చేశారు. కెసిఆర్ తన శక్తియుక్తులతో కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సాధించారని అన్నారు. కానీ అప్పటి ఆంధ్ర సిఎం చంద్రబాబు తెలంగాణలో కడుతున్న కాళేశ్వరంను అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలో తన పలుకుబడిని ఉపయోగించి డిపిఆర్‌లు వాపస్ వచ్చేలా చేశారని ఆరోపించారు.
చంద్రబాబుకు రెండు రాష్ట్రాలు సమాన్యాయమైతే పాలమూరులో వేసిన ఎన్‌జిటి కేసు విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ ఎంతో ఆలోచించి 45 టిఎంసిలు పాలమూరు ఎత్తిపోతల కోసం నికర జలాలు కేటాయించాలని డిపిఆర్ పంపారని అన్నారు. సిడబ్ల్యూసి మాజీ ఛైర్మన్ బజాజ్ నేతంలో కమిటీ వేస్తే చంద్రబాబు కిరికిరి పెట్టి తన పలుకుబడిన ఉపయోగించి వాటి వరకు రిపోర్ట్ బయటకు రాకుండా చేశారని గుర్తు చేశారు. ఆ రిపోర్టు వస్తే పాలమూరు ప్రాజెక్టు ఆగదని అన్నారు. ఢిల్లీలో ఉన్న బిజెపి సర్కార్ చంద్రబాబు చేతుల్లో ఇప్పటికైనా కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన బడ్జెట్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ సిమెంటు ఫ్యాక్టరీని తుక్కుకు అమ్మాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఒత్తిడి పెంచాలన్నారు. ఈ సిమెంట్ ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభిస్తే ఎంతోమంది కార్మికులకు న్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా తెలంగాణపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి ఎపి సిఎం చంద్రబాబుకు శిష్యుడని, ఆయనను ఎదిరించి తెలంగాణకు ప్రాజెక్టులు సాధిస్తారా లేక అక్రమ ప్రాజెక్టులను ఆపగలుగుతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు దగ్గర పనిచేసిన ఒక అధికారిని తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుగా నియమించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. దీంతో తెలంగాణకు ఎలా న్యాయం జరుగుతుందని మండిపడ్డారు. ఇక తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి చేతకానితనం, రాష్ట్రంలో ఉన్న ఎనిమిది బిజెపి ఎంపిల నిర్లక్ష్యంతోనే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి మిగిలిందని అన్నారు. తెలంగాణలో 8 మంది కాంగ్రెస్, 8 మంది బిజెపి ఎంపిలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా తెలంగాణకు ఎలాంటి న్యాయం జరగడం లేదని అన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు కడవేరుగు రాజనర్సు, మారెడ్డి రవీందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, గుండు భూపేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు