బిఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు రాష్ట్ర హైకోర్టను ఆశ్రయించారు. తనపై నమోదు అయిన ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టివేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. నిన్న సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు హరీశ్ రావుపై కేసు నమోదు చేశారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హరీశ్ రావు.. తనతోపాటు, తన కుటుంబ సభ్యల ఫోన్లు ట్యాప్ చేయించారని.. తనపై అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురిచేశారని ఫిర్యాదులో చక్రధర్ గౌడ్ పేర్కొన్నారు.
ఈ కేసుపై హరీశ్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన కుట్ర కేసును కొట్టివేయాలని పిటిషన్ లో హరీశ్ రావు కోరారు. రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. తమ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కేసులు నమోదు చేశారని పిటిషన్ లో హరీశ్‌రావు కోర్టుకు తెలిపారు.