కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు అమలు చేయలేనివారు, తెలంగాణాలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంటే ప్రజలు నమ్మబోరని మంత్రి హరీశ్ రావు అన్నారు. కర్ణాటకలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిందని, ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని చెప్పారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ మాట్లాడారు.
కర్ణాటకలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఏ పథకమూ సరిగ్గా అమలు కావట్లేదన్నారు. శక్తి పథకంలో శక్తిలేదు, గృహలక్ష్మి పథకంలో లక్ష్మి లేదు, అన్న భాగ్య పథకంలో అన్నం లేదు, గృహజ్యోతి పథకంలో జ్యోతి లేదు అని హరీశ్ ఎద్దేవా చేశారు. హామీలిచ్చిన ప్రియాంక పత్తా లేరనీ, రాహుల్ గాంధీ కర్ణాటకకు రామ్ రామ్ చెప్పేశారనీ, ఢిల్లీ పార్టీలను నమ్ముకుంటే ఇదే గతి అని ఆయన అన్నారు.అంతకుముందు కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తీకతోపాటు పలువురు నేతలు హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారికి హరీశ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.