ఎంఎల్‌ఎల ఎర కేసులో సిట్ దర్యాప్తును ఎందుకు అడ్డుకుంటున్నారు
ఎంక్వయిరీ ఆపాలంటూ పిటిషన్ వేయడంలో పరమార్థం ఏమిటి?
సంబంధం లేదంటూనే కేసులు ఎందుకు వేస్తున్నారు?
కమలనాథులకు చిత్తశుద్ధి ఉంటే దర్యాప్తుకు సహకరించాలి
బిజెపి నేతలు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు
ఎనిమిది రాష్ట్రాల్లో సర్కార్లను కూల్చి తెలంగాణలో బొక్కాబోర్లాపడ్డారు
బిజెపి నాయకులపై మంత్రి హరీశ్‌రావు ఫైర్
అడ్డంగా దొరికి నిస్సిగ్గుగా ప్రమాణాలు చేశారు
ప్రజలను ఏమారుస్తే అధికారంలోకి వస్తామనుకోవడం భ్రమ: నిరంజన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: ఎంఎల్‌ఎల కొనుగోలు వ్యవహారంతో తమకు సంబంధం లేదంటూనే రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ విచారణను ఆపాలని కోరుతూ కోర్టులో బిజెపి నేతలు కేసులు ఎందుకు వేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సిట్ సంస్థ దర్యాప్తు చేస్తే అసలు బండారం బయట పడుతుందని కమలం నేతల్లో గుబులు మొదలైందన్నారు. అందుకే బిజెపి నేతలు కేసు విచారణను అడ్డుకునేందుకు అనేక కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. వారు ఎన్ని విధాలుగా అడ్డంకులు సృష్టించినా.. రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరచడం వెనుక ఉన్న అసలు దోషులను ప్రజాకోర్టులో సాధ్యమైనంత త్వరగా నిలబెడతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. గురువారం ప్రగతి భవన్‌లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడి, ఎంఎల్‌సి, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు శాసనసభ్యుల ఎర వ్యవహరంలో దొరికిపోయిన బిజెపి దొంగల పరిస్థితి. పడ్డ ఎలుకలా తయారయిందని ఖ్యానించారు.
గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్న పరిస్థితి బిజెపిదన్నారు. కొనుగోలు చేయడానికి వచ్చిన మఠాధిపతులు, స్వామీజీలు మొదట తమకు తెలియనే తెలియదని బిజెపి నాయకులు బుకాయించారని మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వారిని ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపిన తర్వాత బిజెపి నాయకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయిందన్నారు. దీనిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడేమో తడి బట్టలతో దేవాలయంలో ప్రమాణాలు చేస్తానంటాడు.. ప్రధాన కార్యదర్శి ఏమో విచారణ ఆపమని, కేసు ఢిల్లీకి ఇవ్వమని కోర్టుల్లో కేసులు వేస్తాడని ఎద్దేవా చేశారు. ఇందులో బిజెపికి సంబంధం లేకపోతే కోర్టులో కేసులు ఎందుకు వేస్తారు?అని ప్రశ్నించారు. వారు ప్రమేయం లేనప్పుడు భుజాలు ఎందుకు తరుముకుంటున్నారని ప్రశ్నించారు. లేదా కేసు విచారణ జరిగితే ఢిల్లీ పెద్దల భాగోతం బయటపుడుతుందగని భయపడుతున్నారా? అని నిలదీశారు.
వందల కోట్లతో ప్రభుత్వాలను కూల్చాలనుకుని బహిరంగంగా దొరికింది నిజం కాదా అని హరీష్‌రావు మండిపడ్డారు. దీనికి బిజెపి నేతలు ఖచ్చితమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనల్లో కేసు తొందరగా విచారణ జరగాలి, న్యాయం త్వరగా జరగాలి. నిష్పాక్షికంగా కేసు దర్యాప్తు జరగాలని రాజకీయ నాయకుడైనా, పార్టీ అయినా కోరుకుంటుందన్నారు. కానీ బిజెపి అందుకు విరుద్దంగా వ్యవహరిస్తోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు బిజెపి దర్యాప్తు ఆపాలని ఎందుకు కోరుకంటున్నదన్నారు. దీని వెనుక ఉన్న అర్థం ఏంటి? మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. చివరకు సర్వోన్నత న్యాయస్థానం కూడా బిజెపి బ్రోకర్ల సంభాషణపై స్పందించిందన్నారు. ఎంఎల్‌ఎ కొనుగోలు వ్యవహారంపై న్యాయమూర్తులు సైతం దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారన్నారు.
రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదా?
రాష్ట్ర పోలీసులు, ఐపిఎస్ అధికారుల మీద బిజెపికి నమ్మకం లేదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రాష్ట్ర పోలీసుల మీద విశ్వాసం లేకపోతే..తెలంగాణ ప్రజల ఓట్లు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. బిజెపిది మొదటి నుంచి తెలంగాణ వ్యతిరేక ధోరణి…కక్షపూరిత ధోరణి అని మండిపడ్డారు. బిజెపి ప్రస్తుతం 16, -17 రాష్ట్రాల్లో అధికారంలో ఉందన్నారు. మరి ఆ రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడం లేదా? అక్కడ కేసులన్నీ సిబిఐకి ఇవ్వమని అడుగుతున్నారా? అని ప్రశ్నించారు. ఇది తెలంగాణ ప్రజల మీద, పోలీసుల మీద బిజెపి కక్షపూరిత వైఖరి అవలంభిస్తుంచడం తగదన్నారు. దీనిపై లోయర్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెల్లడానికి అవసరం ఏమొచ్చిందన్నారు. ఎంక్వైరీ ఆపమని, సిట్ ను ఆపమని ఎందుకు బిజెపి నేతలు అడుగుతున్నారని ప్రశ్నించారు. ఇందులో విషయం లేకపోతే ఇన్ని సార్లు ఎందుకు కోర్టుకు పోతున్నారని నిలదీశారు. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడగొట్టిన బిజెపి, తెలంగాణకు వచ్చే సరికి కుడితిలో పడ్డ ఎలుకలా పరిస్థితి తారుమారయిందని విమర్శించారు.
ఎంఎల్‌ఎ కొనుగోలు కేసు సిబిఐకి అప్పగించాలని బిజెపి ప్రధాన కార్యదర్శి ప్రేమెందర్ రెడ్డి ఎందుకు కోర్టుకు వెళ్లారన్నారు. కెసిఆర్ పారదర్శకంగా కేసు విచారణ జరగాలని సిట్ ను ఏర్పాటు చేశారన్నారు. విచారణ జరిగితే తమ కుట్రలు బయటపడతయని, ఇజ్జత్ మానం పోతుందని, పరువు పోతుందని భయపడే విచారణ ఆపాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఇంకో సారి ప్రభుత్వాన్ని పడగొట్టమని చెంపలు వేసుకోవడం తప్ప బిజెపికి మరో మర్గం లేదన్నారు. బిజెపి బహురూపుల వేషాలు, నాటకాలను రాష్ట్ర ప్రజలు ప్రజలు గమనించాలన్నారు. ఎవరు ఎవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నరో దేశ ప్రజలందరికి తెలుసన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు గౌరవ ప్రదంగా ఉండాలి. తమ విలువ తగ్గించుకుని, స్థాయి తగ్గేలా మాట్లాడటం తగదని గవర్నర్‌ను ఉద్దేశించి మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. బిల్లుల పెండింగ్ విషయంలో మంత్రి సబిత ఇంద్రారెడ్డి, గవర్నర్‌ను కలిసి అనుమానాలు నివృత్తి చేశారన్నారు. అయినా గవర్నర్ ఎందుకు భుజాలు తడుముకుంటుందో అర్థం కావడం లేదని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితం గవర్నర్ ఎందుకు తుషార్ అనే వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడారో తమకు తెలియదన్నారు. రాహుల్ గాంధీపై పోటీ చేసిన కేరళకు చెందిన బిజెపి అభ్యర్ది తుషార్ గురించే తాము మాట్లాడామన్నారు. కానీ గవర్నర్ ఎందుకో తన మాజీ ఎడిసి తుషార్ పేరును ప్రస్తావించారన్నారు.
ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు
తెలంగాణ యువత, మేధావులు, ఉద్యోగులు అందరూ బిజెపి కుట్రను జాగ్రత్తగా గమనించాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఉత్తమ విధానాలను రూపొందించి అమలు చేస్తే ప్రజలకు మంచి పాలన అందుతుందన్నారు. ఉత్తమమైన పరిపాలన చేసినప్పుడు ఉత్తమమైన ఫలాలు అందుతాయన్నారు. కానీ బిజెపి అందుకు విరుద్దంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణలో ప్రజలు మంచి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారన్నారు.రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కొనసాగుతోందన్నారు. అయినప్పటికీ టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఆస్థిరపరచాలని చూడడం సిగ్గుచేటని విమర్శించారు. దేశంలో చాలా రాష్ట్రంలో బిజెపికి స్పష్టమైన మెజార్టీ లేకున్నా అడ్డదారుల్లో అధికారాన్ని కైవసం చేసుకుని పాలన సాగిస్తోందని విమర్శించారు.
Harish Rao fires on BJP Leaders