Thursday, December 19, 2024

బిజెపి కుట్రలు తెలంగాణ గడ్డపై సాగవ్: హరీష్‌రావు

- Advertisement -
- Advertisement -

బిజెపి కుట్రలు తెలంగాణ గడ్డపై సాగవు
తలవంచం ప్రజల కోసం నిలబడుతాం
ఎన్నికలు వస్తేనే ఇడి,ఐటి దాడులా..?
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు
మనతెలంగాణ/జగిత్యాలః బిజెపి ఎన్ని కుట్రలకు పాల్పడినా, వేదించినా ప్రజల కోసం నిలబడుతాం తలవంచం అని, తెలంగాణ గడ్డపై బిజెపి కుట్రలు సాగవని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 7న సిఎం కెసిఆర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ స్థలాన్ని గురువారం మంత్రి హరీష్‌రావు, ఎంఎల్‌సి కవిత, జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి హరీష్‌రావు విలేకరులతో మాట్లాడుతూ బిజెపికి ఎన్నికలు వస్తే చాలు ఇడి, ఐటి దాడులు చేస్తారని, బిజెపి విడిచిన బాణాలు ఉత్తరప్రదేశ్, బీహార్‌లో నడుస్తాయేమోగానీ తెలంగాణ గడ్డమీద సాగవని అన్నారు.

బిజెపి పాదయాత్రలన్నీ వెలవెల బోతున్నాయని, మాటలు ఎక్కువ, పనులు తక్కువ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బిజెపి నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారనీ, ఇంతకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎందుకు అభివృద్ధి చేయలేదని, మెడికల్ కళాశాలలు ఎందుకు నిర్మించలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశామని అన్నారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జిఎస్‌టి కింద తెలంగాణకు ఎనిమిదన్నర వేల కోట్లు ఇచ్చామని అంటున్నారని, మీరు తెలిసి తెలియక మాట్లాడుతున్నారని అన్నారు. జిఎస్‌టి కింద కేంద్రం ఇచ్చింది ఏమీ లేదని, తెలంగాణ రాష్ట్రమే జిఎస్‌టి సెస్ట్ కింద కేంద్రానికి 30 వేట కోట్లు ఇస్తే, తెలంగాణకు ఇచ్చింది కేంద్రం ఎనిమిది వేల కోట్లు మాత్రమేనని అన్నారు. 42 శాతం రాష్ట్రానికి ఇస్తామనడం ఆశ్చర్యకరమని, వాస్తవాలు చెబితే కిషన్‌రెడ్డి కిషన్‌రెడ్డి నాలుక కరుచుకున్నారని అన్నారు. కేంద్రం ఇచ్చిన జిఎస్టి 29.6 శాతమేనని మంత్రి హరీష్ రావు అన్నారు. మోడల్ స్కూళ్ల రద్దు, బిఆర్‌జిఎఫ్ తదితర పథకాలను రద్దు చేశారని, వీటితో తెలంగాణకు కొన్ని వేల కోట్లు నష్ట కులుగుతుందన్నారు.

కిషన్‌రెడ్డికి చాలెంజ్ చేస్తున్నాని, 42 శాతం జూటా మాట అని, దీనిపై చర్చకు సిద్దంగా ఉన్నామని హరీష్‌రావు సవాల్ విసిరారు. బండి సంజయ్ తల, తోక లేకుండా మాట్లాడుతున్నారి, ఎనిమిదేళ్ల బిజెపి పాలనలో కోటి కోట్ల అప్పు చేసి దేశాన్ని అప్పుల కుప్పలా మార్చారని అన్నారు. ప్రతి పౌరునిపై లక్ష 24 వేల అప్పు చేసింది బిజెపి అని మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. బిజెపి చెప్పే మాటలన్నీ తెలంగాణ ప్రజలు నమ్మరని, కేసులకు బయపేడే వాళ్లం కాదని మంత్రి అన్నారు. ఉద్యమ సమయంలో ఆంధ్రా పాలకులు ఎన్ని కేసులు పెట్టినా, అరెస్టులు చేసి కుట్రలకు పాల్పడినా తెలంగాణ సాధించామని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. బిజెపికి రాజకీయం, అధికారమే ముఖ్యమని, టిఆర్‌ఎస్‌కు ప్రజలు, వారి అభివృధ్దే ముఖ్యమని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి నీతి అయోగ్ పథకం బుట్ట దాఖలు చేసిందని, మిషన్ భగీరథకు 19205 కోట్లు, మిషన్ కాకతీయకు 5 వేల కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్ సిఫారసు చేస్తే కేంద్ర ఇప్పటి వరకు నయాపైసా విడుదల చేయలేదన్నారు. కేంద్ర నుంచి తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన లక్ష కోట్లను తీసుకువచ్చి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడాలని మంత్రి హరీష్‌రావు హితవు పలికారు. ఈ సమావేశంలో ఎంఎల్‌సిలు కవిత, ఎల్.రమణ, ఎంఎల్‌ఎలు డాక్టర్ సంజయ్‌కుమార్, రవిశంకర్, విద్యాసాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News