సిద్దిపేట: కేంద్ర ప్రభుత్వం దేశ రైతాంగంపై కక్ష్య కట్టిందని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఆదివారం కొమురవెల్లి మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ”రైతులు పండించిన పంటలు కొనే విధంగా, రైతులకు ఇబ్బందులు పెట్టకుండా కొమురవెళ్లి మల్లన్న దేవుడు ఈ కేంద్ర ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగే విధంగా దీవెనలు ఇవ్వాలి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రద్దు చేసిన చట్టాలు చాలా మంచివని, ఆ చట్టాలను మరో రూపంలో తీసుకోస్తామని చెప్పడం సరికాదు. యేడాది పాటు రైతులంతా పోరాటం చేసి, ఆ చట్టాలు రద్దు చేయిస్తే తిరిగి ఆ నల్ల చట్టాలను తెస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ మాట్లాడటం యావత్ దేశ రైతాంగాన్ని అవమానం, కించపర్చడమే. తిరిగి నల్లా చట్టాలు తెస్తే.. 700 మంది రైతుల ఆత్మ గోషిస్తుంది.. కించపర్చినట్లు అవుతుంది. నల్ల చట్టాలను తిరిగి ప్రవేశ పెడతామని చెప్పడం సరికాది. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నల్ల చట్టాలు ప్రకటించడం, తిరిగి ప్రవేశ పెడతామని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పడంలో.. ఎవరి మాట నమ్మాలో తెలపాలి. ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో ఎన్నికల కోసమే వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేశారమోనని అనుమానం వ్యక్తమవుతుంది. స్వయంగా దేశ ప్రధాని వ్యవసాయ నల్ల చట్టాలపై స్పష్టత ఇవ్వాలి. తోమర్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, భేషరుతుగా దేశ రైతాంగానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి” అని మంత్రి హరీశ్ డిమాండ్.
Harish Rao fires on Centre over farm laws