సిఎం రేవంత్‌రెడ్డి పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, చివరకు అందరికీ అన్నం పెట్టే రైతుకు కూడా రైతు భరోసా కోసం షరతులు పెట్టే దుస్థితి దాపురించిందని మాజీ మంత్రి , సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు విమర్శించారు. సంగారెడ్డిలోని ఎంఎల్‌ఎ కాంపు కార్యాలయంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ..తెలంగాణ బతుకు మారుస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ఈ ఏడాది కాలంలో టిఎస్ లోగోను టిజిగా మార్చారని, చిహ్నం, విగ్రహాలు, పోలీస్‌ల లోగోలు మార్చుడు తప్ప ప్రజల మేలు కోసం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యవసాయ మంత్రి, ఆర్థిక మంత్రి కలిసి రైతు భరోసాకు కోతలు పెట్టేందుకు కుస్తీలు పడుతున్నారని వ్యాఖ్యానించారు. రైతు భరోసాకు రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పడం రైతులను అవమానించడం కాదా? అని మండిపడ్డారు.
కొండలు, గుట్టలకు రైతు భరోసా ఇచ్చేది లేదని చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. కొండలు, గుట్టలను సాగు చేస్తున్నది గిరిజనులు, ఆది వాసీలేనని, వారికి అన్యాయం చేయడం దారుణమని అన్నారు. వాన కాలం, యాసంగి కలిపి ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతులకు ఇవ్వాలని తమ పార్టీ డిమాండ్ చేస్తున్నదని అన్నారు. పత్తి సాగు చేసే రైతుకు పెట్టుబడి సాయం ఒకసారి మాత్రమే చేస్తామని ప్రభుత్వం లీకులు ఇస్తున్నదని ఆరోపించారు. పసుపు, అల్లం, చెరుకు రైతులకు ఏడాదికి ఒక సారి మాత్రమే భరోసా ఇస్తామంటే, వారి కడుపు కొట్టడమే అవుతుందని ఆరోపించారు. ‘సిఎ గారు…మీ మాట నమ్మి రెండు లక్షలపైనున్న రుణాలను అప్పు తెచ్చి కట్టిన రైతులకు ఇంకా రుణ మాఫీ కాలేదు’ అని గుర్తు చేశారు. వ్యవసాయ కూలీలకు 28వ తేదీనే రూ.12 వేలు ఇస్తామని చెప్పి మాట తప్పారని ధ్వజమెత్తారు. కోత పెట్టేందుకు వారి సంఖ్యను తగ్గించేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు.
ఎలాంటి షరతులు లేకుండా ఉపాధి హామీ పనిలోకి పోతున్న కోటి నాలుగు లక్షల మందికి ఏటా రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్రైమ్ రేట్‌లో తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఎల్లో జోన్‌లోకి వెళ్లిందని, ఇది బాధాకరమని అన్నారు. దేశానికే శిక్షణనిచ్చిన పోలీస్‌లను రేవంత్‌రెడ్డి తన రాజకీయ కక్ష సాధింపుకోసం వాడుకుంటున్నారని విమర్శించారు. మీడియా సమావేశంలో ఎంఎల్‌ఎలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, డిసిఎంఎస్ ఛైర్మన్ శివకుమార్, సిడిసి మాజీ ఛైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.