Saturday, January 11, 2025

రేవంత్ రెడ్డి తొండిలో తోపు.. బూతులు తిట్టడంలో టాప్: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

రేవంత్ రెడ్డి తొండిలో తోపు.. బూతులు తిట్టడంలో టాప్
రుణమాఫీ పాక్షికంగా చేశామని, తప్పు అయిందని క్షమాపణ అడగాలి
లేదా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి
రైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీ కూడా
పూర్తిగా రుణమాఫీ చేయలేదు
మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ టి.హరీశ్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి దొంగే దొంగ అన్నట్లుగా ఉందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ టి.హరీశ్ రావు విమర్శించారు. రుణమాఫీకి ఎగనామం పెట్టి మొత్తం రుణమాఫీ చేసినట్లు ఫోజులు కొడుతున్నారని మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, సిఎం వ్యవహారశైలి ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. రుణమాఫీ పాక్షికంగా చేశారంటే సరే కానీ మొత్తం చేశామంటే మాత్రం అంగీకరించేది లేదని పేర్కొన్నారు.

రుణమాఫీకి సంబంధించి పూర్తి వివరాలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం రైతుల సంఖ్య ఎంత, రుణమాఫీ అయిన రైతుల సంఖ్య ఎంతనో పూర్తి వివరాలు బయట పెట్టాలని అన్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలతో కలిసి హరీశ్‌రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి తొండిలో తోపు..బూతులు తిట్టడంలో టాప్ అని పేర్కొన్నారు. రేవంత్ పరిపాలనలో ఫ్లాప్ అని ఎద్దేవా చేశారు. రుణమాఫీ చేయనందుకు రాజీనామా చేయాల్సింది నువ్వే.. సిగ్గులేకుండా నన్ను రాజీనామా చేయమంటున్నారు” అంటూ సిఎం రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు.

సిఎం రేవంత్‌రెడ్డికి హరీష్ రావు సవాల్
రుణమాఫీ సంపూర్ణంగా అయిందో లేదో రాష్ట్రంలోని ఏ ఊరికైనా పోయి నేరుగా రైతులనే అడుగుదామని సిఎంను ఉద్దేశించి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ జరిగిందంటే.. ప్లేస్ చెప్పు.. టైమ్ చెప్పు.. ఏ జిల్లాకు పోదాం.. ఏ మండలానికి పోదాం.. ఏ గ్రామానికి పోదాం.. నా నియోజకవర్గానికి వస్తావా..? నీ నియోజకవర్గానికి పోదామా..? రాష్ట్రంలో ఎక్కడికి పోదామో నువ్వే డిసైడ్ చేయ్యి.. అక్కడికి వెళ్లి ఆ ఊరి రైతులను అడుగుదాం అంటూ ఖుల్లాం ఖుల్లా రుణమాఫీ అయ్యిందో లేదో తేల్చేద్దామని సిఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సవాలు విసిరారు. రుణమాఫీ పాక్షికంగా చేశామని, తప్పు అయిందని క్షమాపణ అడగాలి లేదా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని అన్నారు. నోరు బిగ్గరగా చేసినంత మాత్రాన బిఆర్‌ఎస్ వదిలి పెట్టదని చెప్పారు.

కేబినెట్‌లో రూ. 31 వేల కోట్లు అన్నారు.. బడ్జెట్‌లో రూ.26 వేల కోట్లు పెట్టారు… తీరా రూ.17,933 కోట్లు మాత్రమే ఇచ్చి 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని పేర్కొన్నారు. రూ.14 వేల కోట్లు కోత పెట్టి రుణమాఫీ పూర్తయ్యిందని అంటున్నారని విమర్శించారు. సిఎం నీది నోరా..? మోరా..? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతుల సంఖ్య 47 లక్షలు అని చెప్పి 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని, 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేదని.. ఇంకా సిగ్గులేకుండా రుణమాఫీ చేశామని సంకలు గుద్దుకుంటున్నారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని అన్నారు. తాము రూ. 17 వేల కోట్లతో లక్ష రుణమాఫీ చేస్తే 36 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగిందని, కాంగ్రెస్ రూ.17 వేల కోట్లతో రుణమాఫీ పూర్తిగా ఎలా అవుతుందని హరీశ్‌రావు ప్రశ్నించారు.

రేవంత్ చరిత్ర ఏందో నా చరిత్ర ఏందో ప్రజలకు తెలుసు
రేవంత్ చరిత్ర ఏందో తన చరిత్ర ఏందో ప్రజలకు తెలుసు అని, మాట తప్పే చరిత్ర ఆయనదని హరీశ్‌రావు అన్నారు. కొడంగల్‌లో ఓడితే రాజీనామా చేస్తా అని చెప్పి మాట తప్పారని, తెలంగాణ కోసం మాట మీద నిలబడి రాజీనామా చేసిన చరిత్ర తనది అని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేసి, రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని చెప్పానని, కానీ రుణమాఫీ కూడా సంపూర్ణంగా కాలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి ఎనిమిది నెలల ప్రయాణం మోసం… రైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీ కూడా పూర్తిగా రుణమాఫీ చేయలేదని విమర్శించారు.

పాపాత్మున్ని క్షమించమని కోరుతా…
దేవాలయాలు, మసీదులు, చర్చిల మీద ఒట్టేసి చెప్పారని.. చివరకు దేవుళ్ళను కూడా మోసం చేశారని, ఆ పాపం ఊరికే పోదని హరీశ్‌రావు పేర్కొన్నారు. రేవంత్ పాపం ప్రజలకు శాపం కావద్దని తానే ఆ దేవుళ్ళ వద్దకు వెళతానని వ్యాఖ్యానించారు. “పాపత్ముని క్షమించు, మా ప్రజలను హానీ చేయొద్దని దేవుళ్ల వద్దకు వెళ్లి మొక్కుకుంటా” అని చెప్పారు. సిఎం తనను బాడి షేమింగ్ చేస్తున్నారని, అది విజ్ఞతేనా..? అని అడిగారు. ప్రశ్నించే వాళ్లు చావాలని కోరుకుంటున్నారని, తమను చంపడానికి కూడా వెనకాడరని అనుమానం కలుగుతుందని, అయినా తాము భయపడమని అన్నారు. తనను ప్రశ్నించే నైతిక అర్హత రేవంత్ రెడ్డికి లేదు అని, ఆయన తప్పు చేసి తమను ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు.

త్వరలోనే రైతుల పక్షాన బిఆర్‌ఎస్ కార్యాచరణ ప్రకటిస్తుందని వెల్లడించారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేయలేదని తాను ప్రశ్నించానని, ఆగస్టు 15లోపు చేస్తానని మరో తేదీ చెప్పారని, ఆగస్టు 15 వరకు కూడా పూర్తి చేయలేదని అన్నారు. ప్రశ్నిస్తున్న తమపై భౌతిక దాడులకు పురిగొల్పుతున్నారని, కాంగ్రెస్ గుండాలతో తన క్యాంప్ ఆఫీసుపై దాడి చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా దాడులు చేస్తే పెట్టుబడులు వస్తాయా..? తాము అధికారంలో ఉన్నపుడు దాడులు చేస్తే ఉండేవారా..? అంటూ హరీష్‌రావు ప్రశ్నల వర్షం కురిపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News