Friday, September 20, 2024

రాష్ట్రంలో యథేచ్ఛగా హత్యలు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో యథేచ్ఛగా హత్యలు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల నిర్వహణలో ప్రభుత్వం,పోలీసులు విఫలయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయని, 8 నెలల్లో 500 హత్యలు జరిగాయని తాను అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మర్నాడే హైదరాబాద్‌లో రెండు హత్యలు జరగడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తున్నదని అన్నారు. హోం మంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై ఇంతవరకు పోలీసులతో సమీక్ష నిర్వహించలేదని పేర్కొన్నారు. హత్యలు, అత్యాచారాలు యథేచ్ఛగా జరుగుతున్నా ప్రభుత్వానికి, పోలీసులకు చీమ కుట్టినట్టయినా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల మానప్రాణాలను రక్షించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాల్లో లా అండ్ ఆర్డర్ లేకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. శాంతి భద్రతల నిర్వహణలో సిఎం, పోలీసులు పూర్తిగా విఫలయ్యారని చెప్పడానికి రోజురోజుకూ పెరుగుతున్న నేరాలే నిదర్శమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిద్ర మేల్కొని వెంటనే శాంతిభద్రతలను పునరుద్ధరించాలని కోరారు. గత పదేళ్లలో హైదరాబాద్ సహా తెలంగాణ నెలకొల్పిన శాంతి భద్రతల కారణంగా వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు చూస్తే రాష్ట్ర ప్రతిష్టతో పాటు హైదరాబాద్ ప్రతిష్ట కూడా దెబ్బతినే అవకాశం ఉందని వాపోయారు. ఫలితంగా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులపై ప్రభావం పడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంఘ విద్రోహశక్తులపై ఉక్కుపాదం మోపాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఏమాత్రం సరికాదని అన్నారు. సిఎం రాజకీయాలకు అతీతంగా స్పందించి, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడంపై దృష్టి సారించాలని కోరుతున్నానని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News