Saturday, November 16, 2024

ఇది కోతల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదు:హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

వరద బాధితులకు సాయం అందించడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇది కోతల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని తేలిపోయిందని విమర్శించారు. అందుకే వరద బాధితుల్లో ఎవర్ని పలకరించినా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆక్రోశం, ఆగ్రహమే కనిపిస్తున్నాయని అన్నారు. వరద ప్రభావం తగ్గి 20 రోజులు గడిచినా ప్రభుత్వం ఇస్తానన్న పరిహారం అందక బాధితులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వరదలతో ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ సాయం అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని తెలిపారు. ఈ విపత్తు వేళనైనా బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు.

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలకు తగ్గకుండా సహాయం చేయాలని.. ఇండ్లు కూలిపోయి, ఇంట్లో సామాన్లు నష్టపోయిన వారికి రూ.2 లక్షల సాయం అందించాలని, పూర్తిగా ఇళ్లు కొట్టుకుపోయిన వారికి రూ.10 లక్షల సాయం,పంట నష్టం కింద ఎకరాకు మీరు గతంలో డిమాండ్ చేసినట్లుగానే రూ.25 వేల సహాయం అందించాలని, పశువులు నష్టపోయిన వారికి రూ.లక్షకు తగ్గకుండా సహాయం చేయాలని, చిన్న వ్యాపారస్తులకు రూ.5 లక్షల నష్టపరిహారంతో పాటు వడ్డీ లేకుండా రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వరద బాధితులకు సాయం అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, సాయాన్ని పెంచడంతో పాటు, బాధితులందరికీ తక్షణమే ఆ సాయం అందేలా చూడాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్ రావు లేఖ రాశారు.

తొమ్మిది మందిని కాపాడే నాయకుడే కరువయ్యాడు : ఇటువంటి విపత్కర పరిస్థితిలో అధికారంలో ఉన్న సిఎం మరింత బాధ్యతగా వ్యవహరించాలని హరీశ్‌రావు పేర్కొన్నారు. పాలకులు అండగా ఉన్నారనే ధీమాను ప్రజలకు కల్పించాలని, కానీ.. ఈ విషయంలో మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయిందని చెప్పడానికి చింతిస్తున్నానని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. అధికార పార్టీ నుంచి 9 మంది ఎంఎల్‌ఎలు ఉన్న ఖమ్మంలో వరదల్లో చిక్కుకున్న 9 మందిని కాపాడే నాయకుడే కరువయ్యారని, చివరికి ఒక హెలికాప్టర్ కూడా దిక్కు లేని దీన రాష్ట్రంగా తెలంగాణను మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వరదలో చిక్కుకున్న వారిని కాపాడటంలో ఒక జెసిబి డ్రైవర్ చేయగలిగిన పనిని యావత్ ప్రభుత్వ యంత్రాంగం చేయలేకపోయిందంటే ఇంతకు మించిన చేతకాని తనం ఉంటుందా..? అని ప్రశ్నించారు. విపత్తు వేళ ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడుగా,

నష్టపరిహారం విషయంలో అసమంజస వైఖరి ప్రజలను మరింత ఆగ్రహానికి, ఆవేదనకు గురి చేస్తున్నదని అన్నారు. ముఖ్యమంత్రి తక్షణ సాయం కింద ముందు పదివేల రూపాయల నష్టపరిహారం ఇస్తామన్నారని, ఆ తర్వాత నష్ట స్థాయిని బట్టి తగిన సాయం చేస్తామని చెప్పారని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి బాధిత కుటుంబాలకు ఇచ్చే సాయాన్నిమరో రూ. 6,500 కలిపి మొత్తం 16,500లకు పరిమితం చేశారని చెప్పారు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు కొట్టుకుపోయి, చెడిపోయి కట్టుబట్టలతో మిగిలిన వారికి రూ.16,500 సహాయం ఏ మూలకు వస్తాయని అడిగారు. ఇండ్లు కూలిన పేద వారికి రూ.18 వేల సహాయం చేస్తే ఎలా సరిపోతాయి..? అని ప్రశ్నించారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 15,096 మంది వరద బాధితులకు 16,500 సహాయం అందించేటందుకు గుర్తిస్తే, రూ. 18వేల సహాయం అందించేటందుకు కేవలం 146 మంది మాత్రమే గుర్తించడంలో ఆంతర్యం ఏమిటి..? అని నిలదీశారు. రుణమాఫీలో లబ్ధిదారులను కుదించినట్లుగానే, వరద బాధితుల సంఖ్యను కూడా కుదించేందుకు ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News