మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కమీషన్లు కోసం మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ నిధులను ఎక్కువగా ఖర్చుపెట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి రాజకీయ విమర్శలు కట్టిపెట్టి కాళేశ్వరాన్ని పునర్ వినియోగంలోకి తేవడంపై శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నారు. ఢిల్లీ వేదికగా ఆయన తన అవగాహ నా రాహిత్యాన్ని బయట పెట్టుకున్నారని ఒక ప్రకటనలో విమర్శించారు. ఒకవైపు మేడిగడ్డ పునాదిని బలపరిచేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం అని అంటూనే మేడిగడ్డ వద్ద మట్టి ప రీక్షలు సాధ్యపడలేదు అని అంటున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది మే 5న ఒక నివేదిక ఇచ్చిన ఎన్‌డిఎస్‌ఎ వర్షాకాలం వరదలు రాకముందే.. జులై మొదటి వారం లోపే పలు సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని నివేదిక లో పేర్కొన్నదని అన్నారు.
ఎన్‌డిఎస్‌ఎ సూచనలతో.. జూన్ రెండో వారంలో కేంద్ర ప్రభు త్వ సంస్థలు సిడబ్లూపిఆర్‌ఎస్, సిఎస్‌ఎంఆర్‌ఎస్‌లతో సాంకేతిక పరీక్షలు చేయించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం రెండు సంస్థలు సాంకేతిక పరీక్షలకు ఉపక్రమించే స మయానికి వరద
రావడంతో టెస్ట్‌లు ఆపివేసినట్టు ఉత్తమ్ పేర్కొనడం గమనార్హమని, ఈ వైఫల్యానికి ఎన్‌డిఎస్‌ఎ నిర్లక్ష్య వైఖరి కారణమైతే, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వైఫల్యానికి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందన్నట్టు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ వారు చెప్పినవే పరిష్కారాలు అని ప్రభుత్వం కూడా భావించి రాష్ట్ర ఇంజనీర్లను ముందుకు సాగనివ్వలేదని మండిపడ్డాఉ. గోదావరికి వరదలు రాకముందే బ్యారేజీకి సరైయిన రక్షణ చర్యలు తీసుకోవలసిన ప్రభుత్వం ఎన్‌డిఎస్‌ఎ నివేదిక కోసం ఎదురు చూస్తూ 4 నెలల విలువైన కాలాన్ని వృథా చేసిందని, ఇప్పుడేమో వరదల కారణంగా పరీక్షలు ఆపివేశామని చెప్పడం బాధ్యతా రాహిత్యం కాదా..? అని ప్రశ్నించారు.
గత ప్రభుత్వంపై, తెలంగాణ ఇంజనీర్లపై బురద జల్లే ప్రయత్నమే తప్ప బ్యారేజి పునరుద్దరణకు నిర్మాణాత్మక సూచనలు చేయడంలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ దారుణంగా విఫలమైందని ఆరోపించారు. వారి నుంచి నివేదికను తెప్పించుకోవడంలో ప్రభుత్వం కూడా తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని పేర్కొన్నారు. ఈ వరదల్లో మేడిగడ్డ బ్యారేజీకి ఏదైనా ప్రమాదం వాటిల్లితే ఆ బాధ్యత ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. రక్షణ చర్యలు చేపట్టడంలో విఫలం చెందడమే కాక తమ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడం ఇంకా ఎంతకాలం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వానాకాలం ముగిసే నాటికి ఎన్‌డిఎస్‌ఎ నుంచి శాశ్వత రక్షణ చర్యలకు సంబందించిన నివేదికను తెప్పించుకోవడం పట్ల శ్రద్ధ వహించాలని మంత్రి ఉత్తమ్‌ను కోరారు.
తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజి ఏ ఎత్తు వద్ద కడతారు..?
తుమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్టు కడతాం అని ఉత్తమ్ కుమార్ అన్నారని, తమ ప్రభుత్వం గతంలోనే 148 మీటర్ల ఎత్తు వద్ద బ్యారేజి నిర్మించాడానికి మహారాష్ట్రాను ఒప్పించామని హరీశ్‌రావు తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేసిందని గుర్తు చేశారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజి ఏ ఎత్తు వద్ద కడతారు..? ఒప్పందం ప్రకారం 148 మీటర్ల వద్దనా..? 152 మీటర్ల వద్దనా ..? ఉత్తమ్ స్పష్టం చేయాలని అన్నారు. 152 మీటర్ల వద్ద బ్యారేజి కట్టాలని అనుకుంటే మొదట మహారాష్ట్రా ప్రభుత్వాన్ని ఒప్పించాలని, ఆ తర్వాతనె బ్యారేజి పనులను ప్రారంభించాలని కోరారు. ఆనాడు మహారాష్ట్రను ఒప్పించలేక పనులు చేయకుండా వదిలేసింది ఎవరు..? ఆ వైఫల్యం మీది కాదా? అని మంత్రి ఉత్తమ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తుమ్మిడి హట్టి వద్ద బ్యారేజీ కట్టినా లిఫ్ట్ లేకుండా ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్లు వెళ్లవని ఉత్తమ్‌కు తెలీదా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.