మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర సర్కార్ కేబినెట్, శాసనసభ ద్వారా ఆమోదించిన బిల్లులను గవర్నర్ నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడం ఏమిటని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. సోమవారం సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మంగోల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన వాటర్ ట్రిట్‌మెంట్ ప్లాంట్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌తో కలిసి ప్రారంభించి అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఫారెస్టు యూనివర్శిటీ లేదని, రేపటి మానవ మనుగడ కోసం ఆడవులు పెరిగి పచ్చదనంగా ఉండాలనే దూరదృష్టితో సిఎం కెసిఆర్ ఫారెస్టు యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని కేబినెట్, ఆసెంబ్లీలో ఈ బిల్లును ఆమోదించి గవర్నర్‌కు పంపారన్నారు. అయినా గవర్నర్ ఈ బిల్లును ఏడు నెలలుగా పెండింగ్‌లో పెట్టారని, ప్రస్తు తం సుప్రీంకోర్టులో ఈ కేసు ఉండడంతోనే హడావిడిగా గవర్నర్ ఈ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సుప్రీం కోర్టులో వేయకుంటే ఇంకేన్నాళ్లు పట్టేదన్నారు.
కామన్ రిక్రూర్‌మెంట్ బోర్డు అనేది దేశంలో కొత్తదేమీ కాదని బీహార్ రాష్ట్రంలో 1961లోనే అమలులోకి వచ్చిందన్నారు. బీహర్‌తో పాటు జార్ఖండ్ , ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌లలో కూడా కామన్ ఎగ్జామినేషన్ అమలులో ఉందని ఇదే తరహా తెలంగాణలో సైతం ఉంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటని కేంద్ర సర్కార్‌ను ప్రశ్నించారు. నీచ రాజకీయాల కోసం పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర , పిల్లల భవిష్యత్తు ఏమైనా పర్వాలేదు తాము రాజకీయంగా లబ్ధిపొందుతామన్న లక్షంతో బిజెపి సర్కార్ ఉందని ఆరోపించారు. కామన్ రిక్యూమెంట్ బోర్డు ద్వారా అన్ని యూనివర్శిటీల్లో ఉండే ఉద్యోగాలను భర్త్తీ చేస్తే పారదర్శకంగా ఉంటుందని సిఎం కెసిఆర్ ఆలోచించారన్నారు. అయినా బిల్లులను పెండింగ్‌లో పెడుతూ బిజెపి సర్కార్ అడ్డుకోవడం ఏమిటని మండిపడ్డారు. ప్రగతికి సాయం చేయకుండా అభివృద్ధిని గొడ్డలి పెట్టి అడ్డుకోవడంపై యావత్తు తెలంగాణ ప్రజానీకమంతా బిజెపి కుట్రలను గమనిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయాలని నోటిఫికేషన్ ఇస్తే ఒకేసారి ఇన్ని ఉద్యోగాలు ఇస్తే తమ పార్టీ కార్యకర్తల భవిష్యత్తు ఏం కావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనడం సిగ్గు చేటన్నారు.
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావద్దొన్నదే బిజెపి లక్షంగా పెట్టుకుందన్నారు. పేపర్లు లీక్ చేస్తూ పిల్లల జీవితాలతో ఆడుకోవడం బిజెపికే చెల్లుతుందని మండిపడ్డారు. రాష్ట్రం ఆమోదించిన బిల్లులను అడ్డుకోవడం రాష్ట్ర ప్రయోజనాలను మంట కలపడమేనని అన్నారు. గవర్నర్ చర్యలను తెలంగాణ సమాజం ఆసహించుకుంటుందన్నారు. స్వాతంత్ర సంస్థలను కేంద్ర సర్కార్ పని చేయనివ్వకుండా రాజకీయంగా వాడుకోవడం సరికాదన్నారు. మూడు బిల్లులను ఆమోదించడం పట్ల గవర్నర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఎంఎల్‌సి యాదవరెడ్డి, ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జడ్‌పి చైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మ గ్రంథాలయ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.