Friday, December 20, 2024

ఎన్నికలప్పుడు గ్యారెంటీల గారడీ.. ఇప్పుడేమో అంకెల గారడీ: హరీశ్‌రావు ఫైర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఎన్నికలప్పుడు గ్యారెంటీల గారడీ.. ఇప్పుడేమో అంకెల గారడీ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు విమర్శించారు. శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆత్మస్తుతి, పరనిందలా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలతో కలిసి హరీశ్‌రావు హరీశ్‌రావు మీడియా సమావేశం నిర్వహించారు.

ఓట్ల ముందు గ్యారెంటీల గారడీ.. గెలిచిన తర్వాత అంకెల గారడీ.. ప్రజలను బురిడి కొట్టిచేందుకు, భ్రమలు పెట్టించేందుకు భట్టి తన బడ్జెట్ ప్రసంగంలో చాలా ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది మొదటి బడ్జెట్ అని, ఈ బడ్జెట్‌లో దశదిశ ఇస్తారు అనుకున్నాం.. కానీ దశదిశ ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపేటటువంటి బడ్జెట్ ఇది అని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు నీరు గారిపోయాయి…సంక్షేమం సన్నగిల్లింది… అభివృద్ధి అగమ్యగోచరమైందని అన్నారు. ఈ బడ్జెట్‌లో అన్ని వర్గాలను తీవ్ర నిరాశ పరిచిందని చెప్పారు. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని అప్పుడేమో బాండ్ పేపర్ మీద రాసిచ్చారని, ఆరు గ్యారెంటీలకు కేటాయింపులు బడ్జెట్‌లో లేవు అని, వాటి కేటాయింపులు ఏమి..? అని నిలదీశారు.

కోటి మంది అక్కాచెల్లెళ్లకు 20 వేల కోట్లకు పైగా బాకీ..
ప్రజలకు ఇచ్చిన హామీలను, ఎన్నికల మేనిఫెస్టోను ప్రతిబించించే విధంగా బడ్జెట్ ఉండాలని, కానీ కాంగ్రెస్ తమ మేనిఫెస్టోను మరిచిపోయినట్టు ఉందని హరీశ్‌రావు విమర్శించారు. వారి ఆరు గ్యారెంటీల్లో మొదటి హామీ మహిళలకు రూ. 2500 చొప్పున ప్రతినెల ఇస్తామన్నారని, ఈ బడ్జెట్‌లోనైనా వాటికి నిధులు కేటాయింపు చేస్తారేమో అనుకున్నామని అన్నారు. 18 ఏండ్లు నిండిన కోటి మంది అక్కాచెల్లెళ్లకు శుభవార్త వినిపిస్తారేమో అనుకుంటే నిరాశ చూపారని మండిపడ్డారు. 8 నెలల లెక్క తీస్తే 20 వేల కోట్లకు పైగా బాకీ పడ్డారని, మహాలక్ష్మి పథకం మహిళలకు మహా నిరాశను మిగిల్చారు అని పేర్కొన్నారు.

ఆసరా పెన్షన్ల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని, అవ్వతాతలకు ఇచ్చే రూ. 4 వేల పెన్షన్ ప్రస్తావన కూడా లేదని అన్నారు. ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి రూ. 4 వేలు పెన్షన్ ఇస్తామని చెప్పారని, అధికారంలోకి రాగానే డిసెంబర్‌లో పెన్షన్లు ఇస్తామన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం జులై నెలలో ఉన్నామని ఇప్పటి వరకు రాలేదని విమర్శించారు. ఇంటికి రెండు పెన్షన్లు, కొత్త పెన్షన్లు, నౌకరి ఉన్న ఇస్తామని ఊదరగొట్టారని, ఈ బడ్జెట్‌లో ఎందుకు కేటాయించలేదని అడిగారు. తమది పేదల ప్రభుత్వం అని అన్నారని, ఆసరా పెన్షన్లు అందుకునే నిరుపేదల కంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా పేదవాళ్లు ఉన్నారా..? అని ప్రశ్నించారు. పేదల ప్రభుత్వం అని చెప్పుకునే అర్హత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని చెప్పారు. కొండంత ఆశతో ఎదురుచూస్తున్న వృద్ధులను, ఒంటరి మహిళలను, దివ్యాంగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

ఉద్యోగ నియామకాలపై స్పష్టత ఇవ్వలేదు..
విద్యార్థులకు ఇస్తామన్న 5 లక్షల భరోసా కార్డు ముచ్చట లేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. నిరుద్యోగులకు రూ.4 వేల భృతి గురించి మాట్లాడలేదు అని చెప్పారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని, 8 నెలలు అయిపోయిందని, మిగిలింది 4 నెలలే అని పేర్కొన్నారు. ఉద్యోగాల గురించి ప్రస్తావనే లేదని, ఉద్యోగ నియామకాలపై స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. స్కూటీలు ఇస్తామన్నారు..ఎస్‌సి, ఎస్‌టిలు పదిలో పాసైతే పది వేలు ఇస్తామన్నారు.. వాటి ప్రస్తావనే లేదని అన్నారు. విద్యార్థులను కూడా కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని హరీశ్‌రావు మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News