తాను పత్రికా సమావేశం పెట్టిన తర్వాతనైనా మేల్కొని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్నటి డేట్ (జనవరి 22, 2025)తో లెటర్ రాసి, శుక్రవారం విడుదల చేసినందుకు మాజీ మంత్రి హరీష్‌రావు ధన్యవాదాలు తెలిపారు. జనవరి 22వ తేదీనే నిజంగా లేఖ రాసి ఉంటే, ఆ రోజే మంత్రి మీడియాకు ఇచ్చి ఉండే వారు కదా..? ఈరోజు వరకు దాచిపెట్టరు కదా..? అని అడిగారు. గోదావరి, కృష్ణా, పెన్నా లింకింగ్ విషయంలో ఎపి ముఖ్యమంత్రి 2024 నవంబర్ 15.న లేఖ రాస్తే, దాని నిధుల కొరకు 2024 డిసెంబర్ 31న మరొక లేఖ రాస్తే, మీరు ఈరోజు వరకు ఎందుకు స్పందించలేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నిలదీశారు. ఉత్తరాలు ఎందుకు రాయలేదు, ఎందుకు ఆ ఉత్తరాలను విడుదల చేయలేదని ప్రశ్నించారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై తన వ్యాఖ్యలను మంత్రి వక్రీకరించడం శోచనీయమని పేర్కొన్నారు. తాను 200 టిఎంసిల తీసుకుపోతున్నారని ఎక్కడ అన్నాను అని, తీసుకుపోయేందుకు ప్రాజెక్టు రూపకల్పన చేస్తుంటే మీరు మౌనం వహిస్తున్నారని తప్పుబట్టానని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.
ప్రశ్నిస్తే గానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు
తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం తాను ప్రశ్నిస్తే గానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు. 512 నుంచి -299 ఒప్పందం అనేది ఒకే ఏడాదికి అని మీరు విడుదల చేసిన డాక్యుమెంట్లలోనే స్పష్టంగా ఉందని, మంత్రి హోదాలో ఉండి ఎందుకు అబద్దాలు చెబుతున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నంచారు. ఒకవేళ 512 నుంచి -299 ఒప్పందం ఉండి ఉంటే, సెక్షన్ 3 ప్రకారం, నీటి పంపకాలు అనే విషయం ఎందుకు ఉత్పన్నమైతదని అడిగారు. సెక్షన్ 3 కోసం బిఆర్ఎస్ ఎందుకు పట్టుబట్టిందని, ట్రిబ్యునల్ సమావేశానికి మంత్రి హోదాలో హాజరైన మొదటి వ్యక్తి తానొక్కడినే అని మరో అబద్దం చెబుతున్నారని పేర్కొన్నారు. 2016లోనే ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్,
ఇరిగేషన్ మంత్రిగా తాను ట్రిబ్యునల్ మీటింగ్‌లో పాల్గొని తెలంగాణ పక్షాన కొట్లాడామని, మీటింగ్ మినట్స్‌లో ఉంటది చూసుకోవాలని సూచించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలోనూ నోటికి వచ్చిన అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును వ్యతిరేకించలేదనేది పచ్చి అబద్దం అని, ఇదే అబద్దాన్ని పదే పదే చెబుతున్నారని పేర్కొన్నారు. ఎపి సిఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుంచే వ్యతిరేకిస్తూ పుంఖానుపుంఖాలుగా లేఖలు రాసాశామని గుర్తు చేశారు. తాను మాట్లాడింది గోదావరి జలాల్లో జరుగుతున్న అన్యాయం గురించి అయితే, ఆ విషయం మాట్లాడకుండా ఏవోవో మాట్లాడి, డైవర్ట్ చేసే ప్రయత్నం చేసారని అన్నారు. మంత్రి చెప్పిన అబద్దాలకు పూర్తి వాస్తవాలతో పత్రికా సమావేశం నిర్వహించి, అబద్దపు ప్రచారాన్ని పటాపంచలు చేస్తానని ప్రకటించారు.