సిద్దిపేట: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని పార్టీ శ్రేణులు బాధపడాల్సిన అవసరం లేదని, భవిష్యత్తు బిఆర్‌ఎస్ పార్టీదేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని కొండ మల్లయ్య గార్డెన్‌లో బిఆర్‌ఎస్ కృతజ్ఞత సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళలో అబద్ధాలను ప్రచారం చేసిందని వ్యాఖ్యానించారు. అధికారం చేపట్టాక ఆ పార్టీ మంత్రులు హామీలను నెరవేర్చాలంటే అసహనం వ్యక్తం చేయడంతో పాటు దాడులకు పాల్పడే కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్‌ను అడ్డం పెట్టుకొని ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వ్యవసాయ రంగంపై కాంగ్రెస్ కరంట్ కోతలను విధించడం మొదలు పెట్టిందన్నారు. 24 గంటలకు 14 గంటలకు మించి సరిగ్గా కరంట్ సరఫరా చేయడం లేదన్నారు. డిసెంబర్ 9న రుణ మాఫీ చేస్తామని ఎన్నికలలో ప్రచారం చేసిన రేవంత్‌రెడ్డి ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
రైతు బంధును రూ. 15 వేలకు పెంచి ఇస్తామని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రూ. 10 వేల రూపాయలను కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని 100 రోజుల లోపు అమలు చేయాలని త్వరలో రానున్న పార్లమెంట్ ఎన్నికల కోడ్‌కు ముందు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్‌సితో పాటు ఆసరా పింఛన్ల పెంపు, వడ్లకు 500 బోనస్ , కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, లాంటి ప్రతి హామీని అమలు చేయాలన్నారు. గత ఎన్నికలలో బిఆర్‌ఎస్ 1.8 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయిందన్నారు. ఇందులో 4 లక్షల మంది ఓట్లు వేస్తే బిఆర్‌ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చేదన్నారు. బిఆర్‌ఎస్‌కు బెదిరింపులు కొత్తేమీ కాదని తెలంగాణ సాదన కోసం జరిగిన ఉద్యమంలో సమైక్య సిఎంలు ఎన్ని బెదిరింపులకు గురి చేసినా ఉద్యమాన్ని ఆపలేదని గుర్తు చేశారు. 2009లో 10 ఎంఎల్‌ఎ సీట్లు గెలిచినా భయపడ లేదని, భవిష్యత్తు తమ పార్టీదే అంటూ కెసిఆర్ వెనుకడుగు వేయకుండా ముందుకు సాగారన్నారు.
పార్టీ కన్న తల్లి లాంటిదని అందరం కలిసికట్టుగా పనిచేసి పార్లమెంట్ ఎన్నికలలో ఘన విజయం సాధిదామన్నారు. అంతకుముందు కాంగ్రెస్ అగ్ర నేతలు, ముఖ్యమంత్రి , మంత్రులు ఎన్నికల ప్రచారాలలో ఇచ్చిన హామీలను వీడియో రూపంలో ప్రదర్శించారు. ఈ కృతజ్ఞత సభలో పార్టీ శ్రేణులు వేలేటి రోజా రాదాకృష్ణ శర్మ, కడవేర్గు మంజుల రాజనర్సు, మారెడ్డి రవీందర్ రెడ్డి, కొండం సంపత్‌రెడ్డి, పాల సాయిరాం, ఎడ్ల సోంరెడ్డి, రాగుల సారయ్య, జాప శ్రీకాంత్ రెడ్డి, నముండ్ల రాంచంద్రం, మోహన్‌లాల్, పూజల వెంకటేశ్వర్‌రావు (చిన్న), జంగిటి కనకరాజు, వజీర్, అత్తర్ పటేల్, మోయిజ్, సాకి ఆనంద్, మల్లికార్జున్, ప్రభాకర్, ఎడ్ల అరవింద్ రెడ్డి తదితరులు ఉన్నారు.