Friday, January 24, 2025

రెండు నెలల్లో 9,222 పోస్టుల భర్తీ

- Advertisement -
- Advertisement -

రెండు నెలల్లో 9,222 పోస్టుల భర్తీ
ఒకేసారి 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పోస్టింగ్‌లు ఇవ్వడం దేశంలోనే రికార్డ్
ఐదు నెలల్లోనే పారదర్శకంగా నియామకాలు 
వైద్యరంగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంటే యుపి చిట్టచివరి స్థానంలో ఉంది
60 ఏళ్లలో 20 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, 9 ఏళ్లలో 35 మెడికల్ కాలేజీలు చేశాం
తెలంగాణ వస్తె ఏం వస్తుంది అనేవారికి ఇదే సమాధానం
సిఎం కెసిఆర్ పట్టుదల వల్లే ఇది సాధ్యమైంది
రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు
1,061మంది అసిస్టెంట్ ప్రొఫసర్లకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వైద్యారోగ్య రంగాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తోందని ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సోమవారం శిల్పకళా వేదికలో కొత్తగా నియామకమైన 1,061మంది అసిస్టెంట్ ప్రొఫసర్లకు శాఖ మంత్రి హరీశ్ రావు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగాద మంత్రి మాట్లాడుతూ, పేద ప్రజలకు న్యాణమైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్రం ప్రభుత్వం నూతన మెడికల్ కాలేజీలను, ఆసుత్రులను ఏర్పాటు చేస్తోందని అన్నారు.

పేద ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులుగా చేరుతున్న నూతన వైద్యులకు మంత్రి స్వాగతం పలికారు. ప్రభుత్వ వైద్యారోగ్య వ్యవస్థను పట్టిష్టం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్‌పెద్ద మొత్తంలో మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు నిర్మించి,వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని భర్తీ చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా, టీచింగ్ ఆసుపత్రుల్లో సేవలు అందించేందుకు గాను, 34 స్పెషాలిటీల్లో 1,061మందికి ఒకేసారి పోస్టింగ్‌లు ఇస్తున్నామని, ఇది దేశంలో వైద్య విద్య రంగంలో రికార్డ్ అని పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ వల్లే ఇది సాధ్యం అయిందని, ఇది విప్లవాత్మక చర్య అని వ్యాఖ్యానించారు.

కేవలం 5 నెలల్లోనే అత్యంత పారదర్శకంగా నియామక ప్రక్రియ పూర్తి చేసి, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేందుకు కృషి చేసిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఇదే వేదికగా గత నెలలో 969 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు నియామక పత్రాలు అందించామని గుర్తు చేశారు. 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరలో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించుకోబోతున్నామని చెప్పారు. ఎన్నో ఏళ్ల కలను సాకారం చేస్తూ, సిఎం కెసిఆర్ వైద్య శాఖలోని ఏడు విభాగాల్లో మొత్తం 1,331 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేశారని, ఇందులో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్, ఆయుష్ విభాగానికి చెందిన డాక్టర్లు ఉన్నారని అన్నారు.

తొమ్మిదేళ్లలో వైద్యారోగ్య శాఖలో 22,263 పోస్టుల భర్తీ
గడిచిన తొమ్మిదేళ్లలో ఒక్క వైద్యారోగ్య శాఖలోనే 22,263 పోస్టులు భర్తీ చేసుకోగా, మరో 9,222 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని మంత్రి తెలిపారు. రెండు మూడు నెలల్లో ఇది పూర్తవుతుందన్నారు. మొత్తంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత 31,484 పోస్టుల నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. కొందరు ఉద్యోగాలు ఇవ్వడం లేదని అంటున్నారని, వారు కల్లుండి చూడలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. రోగులతో ప్రేమగా మాట్లాడితే వారి వ్యాధి సగం తగ్గుతుందని, మందులు రోగాన్ని నయం చేస్తే,వైద్యులు మాత్రమే రోగిని పూర్తి ఆరోగ్యవంతున్ని చేస్తారని అన్నారు. ఎన్ని మందులు ఇచ్చామనేదానికంటే, మీరు ప్రేమగా మాట్లాడే మాట, మీరు ఇచ్చే ధైర్యం సగం రోగాన్ని తగ్గిస్తుందని చెప్పారు. మానసికంగా రోగికి ఆత్మవిశ్వాసం కలిగిస్తుందని పేర్కొన్నారు.

వైద్య వృత్తి గౌరవాన్ని పెంచాలి
వైద్య విద్యార్థులపై ప్రభుత్వం కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తున్నదని, దానిని వైద్య సేవల ద్వారా సమాజానికి తిరిగి ఇవ్వాలని హరీశ్‌రావు కోరారు. ప్రాణం పోసేది అమ్మ అయితే, ఆనారోగ్యం బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారికి వైద్యం అందించి పునర్ జన్మ ఇచ్చేది ఒక్క వైద్యుడు మాత్రమే అని పేర్కొన్నారు. వైద్య వృత్తికి మరింత గౌరవాన్ని పెంచాలని కోరారు. దేశాన్ని కాపాడే సైనికులు, దేశానికి అన్నం పెటే ్టరైతులు, ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులు ఎంతో గొప్పవారని వ్యాఖ్యానించారు. ఒక కుటుంబంలో ఒకరికి రోగం వస్తే, చికిత్స కోసం లక్షల రూపాయలు అప్పు చేసి, ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉండేదని వాపోయారు.అది కుటుంబ పరిస్థితిపై, పిల్లల చదువుపై, వారి భవిష్యత్ ఎంతో ప్రభావితం అయ్యేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. ఖరీదైన వైద్యం పేదలకు అందుతున్నదని తెలిపారు.

ప్రథమ స్థానంలో ఉండేలా అందరూ కృషి చేయాలి
నీతి అయోగ్ ర్యాంకింగ్‌లో తెలంగాణ ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నామని, అందరం కలిసి మొదటి స్థానానికి వచ్చేలా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.మిషన్ భగీరథ, పల్లె, ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాల ద్వారా సీజనల్ వ్యాధులు దాదాపు తగ్గించామని, బస్తీ దవాఖానలు, పల్లె దవాఖనాల ద్వారా పెద్ద ఆసుపత్రుల్లో ఒపి లోడ్ తగ్గించామని తెలిపారు. దీంతో టెర్షియరి సేవలపై మరింత దృష్టి పెట్టి అవకాశం కలిగిందని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 12,364 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నామని, రాష్ట్రంలో ఒక్కొక్కరి వైద్యంపై చేస్తున్న తలసరి ఖర్చు రూ. 3,532 అని,ఇందులో దేశంలో మూడో స్థానంలో ఉన్నామని అన్నారు. మందులు, పరికరాలు లేవనే పరిస్థితి లేకుండా అన్ని ఆన్‌లైన్ చేశామని తెలిపారు.

వచ్చే నెల నుంచి 134 రకాల వైద్య పరీక్షలు
టీ డయాగ్నొస్టిక్ ద్వారా ప్రస్తుతం 57 రకాల పరీక్షలు చేస్తున్నామని, మరో నెల రోజుల్లో ఆ పరీక్షలకు 134కు పెంచబోతున్నమని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. గత ప్రభుత్వాలు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయలేదని, దీంతో పిల్లలు చైనా, ఉక్రెయిన్ వంటి దేశాలకు వెళ్లాల్సిన దుస్థితి ఉండేదని అన్నారు.గతేడాది 8 మెడికల్ కాలేజీలను ఏక కాలంలో ప్రారంభించుకోగా, ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోబోతున్నామని పేర్కొన్నారు. ఇందులో ఇప్పటికే 8 మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి అనుమతులు వచ్చాయని చెప్పారు. 60 ఏళ్ల ఉమ్మడి పాలనలో కేవలం 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు అయితే, 9 ఏళ్లలో తెలంగాణ సర్కారు 20 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందని అన్నారు.60 ఏళ్లలో 20 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, 9 ఏళ్లలో 35 మెడికల్ కాలేజీలు చేశామని, తెలంగాణ వస్తె ఏం వస్తుంది అనేవారికి ఇదే సమాధానమని పేర్కొన్నారు. 2014 లో 2,950 ఎంబిబిఎస్ సీట్లు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 8,340కి చేరిందని చెప్పారు. సిఎం కెసిఆర్ పట్టుదల వల్లే ఇది సాధ్యమైందని,మంత్రం వేస్తే కాదని అన్నారు.

కొత్తగా 10 వేల సూపర్‌స్పెషాలిటీ పడకలు
రాష్ట్రంలో కొత్తగా పది వేల సూపర్‌స్పెషాలిటీ పడకలు రాబోతున్నాయని మంత్రి తెలిపారు. రూ.1,100 కోట్లతో 2000 పడకలతో వరంగల్ హెల్త్ సిటీ, నగరం నలువైపులా వెయ్యి పడకలతో టిమ్స్ ఆసుపత్రులు, నిమ్స్‌ను 2 వేల పడకలు, ఎంఎన్‌జె ఆసుపత్రి 300 నుంచి 750 పడకలు, గాంధీలో 200 సూపర్ స్పెషాలిటీ పడకలు రాబోతున్నాయన్నారు. వరంగల్ హెల్త్ సిటీని ఈ ఏడాది ప్రారంభిస్తామని చెప్పారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కలిపితే 2014లో 17,150 పడకలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 33,314 లకు పెంచుకున్నామని పేర్కొన్నారు. కొత్త హాస్పిటల్‌లు అందుబాటులోకి వస్తే 50 వేల మార్క్ అందుకుంటామన్నారు.

రాష్ట్రంలో ఉత్తమ పరిశోధనలు జరగాలి
టీచింగ్, రీసెర్చ్, ట్రీట్ మెంట్ బాధ్యతలు అసిస్టెంట్ ప్రొఫసర్లపై ఉన్నాయని, ఎవరైనా పరిశోధనలు చేయాలని అనుకుంటే సదుపాయాలు కల్పిస్తామని హరీశ్‌రావు అన్నారు. దేశంలోనే ఉత్తమ పరిశోధనలు మన రాష్ట్రంలో జరగాలని కోరారు. వైద్యరంగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంటే యుపి చిట్టచివరి స్థానంలో ఉందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి జరిగిందంటే డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల కాదని, సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో నడిచే సత్తా ఉన్న సింగల్ ఇంజన్ సర్కారు వల్ల అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News