సిద్దిపేట: జిల్లా గ్రామీణ మండలం బుస్సాపూర్ లో బయో-సిఎన్ జి ప్లాంట్ ను సోమవారం బ్రిటిష్ డిప్యూటీ హై కమీషనర్ డా. ఆండ్రూ ఫ్లెమింగ్ తో కలిసి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ”బయో-సిఎన్ జి ఏర్పాటుకు బలం, బలగం సిద్దిపేట పుర ప్రజలు. తడి, పొడి, హనీకర చెత్తను ప్రజలు విభజన చేయడం వల్లే బయో-సిఎన్ జి ఏర్పాటు సాధ్యం అయ్యింది. ప్రపంచం మొత్తం చెత్తతో బాధపడుతుంది. ల్యాండ్ ఫిల్లింగ్ తో భూమి, నీరు కలుషితం అవుతుంది. గతంలో సిద్దిపేటలో నలు దిక్కులా ప్రదేశాలు చెత్తతో నిండి పోయాయి. సిద్దిపేటలో చెత్త కుప్పలు ఉండకూడదు అన్న ఉద్దేశ్యంతోనే బయో-సిఎన్ జి ప్లాంట్ ఏర్పాటు చేశాం. రోజుకు సిద్దిపేట పట్టణంలో 55 వేల కిలోల చెత్త ఉత్పత్తి అవుతుంది. ప్రజా భాగస్వామ్యం, స్థానిక ప్రజా ప్రతినిధుల కృషితో సిద్దిపేట స్వచ్చ పట్టణంగా మారింది. తడి, పొడి చెత్త కాకుండా హానీకర చెత్తను ఇన్సు లెటర్ లో అత్యధిక టెంపరేచర్ లో మండిస్తున్నాం. 6 సంవత్సరాల కృషితో సిద్దిపేట సుస్థిర పట్టణంగా నిలిచింది. చెత్తను కుప్పలుగా పోయని దేశంలోనే తొలి పట్టణంగా సిద్దిపేటను తీర్చిదిద్దాలి. అభివృద్ది అంటే ఆరోగ్య వాతావరణంలో జీవించగలిగే పరిస్థితులను సృష్టించడం. చెత్తను ఆదాయ వనరుగా మార్చుతున్నాం.
బయో-సిఎన్ జి గ్యాస్ ను పట్టణంలో రెస్టారెంట్ లకు సరఫరా చేస్తాం. మున్సిపల్ వాహనాలకు ఇంధనంగా బయో-సిఎన్ జి గ్యాస్ ను ఉపయోగిస్తాం. సేంద్రీయ ఎరువులను రైతులకు ఎరువుగా అందిస్తాం. పిల్లలకు ఆస్తులు, అంతస్తులు కంటే ఆరోగ్యాన్ని ఇవ్వడమే ముఖ్యం. ఆరోగ్య సిద్దిపేట తయారీకి ప్రతి ఒక్కరూ సహకరించాలి. సఫాయి అన్న సలాం అని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఇప్పటివరకు సిద్దిపేట పట్టణం 14 జాతీయ స్థాయి అవార్డులు, 4 రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకుంది. అవార్డులను సిద్దిపేట చేజిక్కించుకోవడంలో సఫాయిలు ముఖ్య పాత్ర వహించారు. తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట దిక్సూచిగా నికిచినట్లే అభివృద్ధికి కూడా దిక్సూచిగా నిలపాలి. నిరంతర కృషి, ఉద్యమ స్పూర్తి ఉంటే అభివృద్ధిలో దేశానికే దిక్సూచిగా సిద్దిపేట నిలుస్తుంది” అని అన్నారు.
Harish Rao inaugurate BIO-CNG Plant in Siddipet