మహబూబ్ నగర్: జిల్లాలోని బాలానగర్ లో 30పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ”కరోనా కష్ట కాలంలో ఉపయోపడుతుందని ఈ ఆసుపత్రిని ప్రారంభించాం. డాక్టర్ లక్ష్మారెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి 2 కోట్ల 20 లక్షలతో 30 పడకల ఆసుపత్రిని నిర్మించారు. ఐదేళ్లు మంత్రిగా ఉండి చాలా బాగా పని చేశారు. తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్ జిల్లాలో ఐసీయూలు, డయాలసిస్ కేంద్రాలు లేవు. సిఎం కేసీఆర్ నాయకత్వంలో లక్ష్మారెడ్డి చాలా మంచి కార్యక్రమాలు చేపట్టారు. కేసీఆర్ కిట్, కంటి వెలుగులు, పార్థీవ వాహనం, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజి ఇలా చాల మంచి పనులు చేశారు. టీడీపీ, కాంగ్రెస్ పాలనలో మహబూబ్ నగర్ కు వలసల జిల్లాగా పేరు వచ్చింది. ఇది వారిచ్చిన ఘనత. కేసీఆర్ హయంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కల్వకుర్తి నీళ్లు జడ్చర్ల దాకా తీసుకెళ్లాం. నెట్టెంపాడు, కోయిల్ సాగర్, బీమా ప్రాజెక్టులు పూర్తి చేసి జిల్లాకు నీరు ఇ్వవగలిగాం.చెక్ డ్యాంలు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగుచేశాం. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజి ఉందా… అలాంటిది కేసీఆర్ 3 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. 450 కోట్లతో మహబూబ్ నగర్ మెడికల్ కాలేజికి 9 నెలల్లో అనుమతులు తెచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లాలో 510 కోట్లతో మెడికల్ కాలేజి కడుతున్నారు. కేంద్రంలో అధికారంలో బీజిపి ప్రభుత్వం దేశంలో 157 కాలేజీలు ఇచ్చింది. కానీ, తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజి ఇవ్వలేదు. వారు ఇవ్వకపోయినా మన సీఎం 17 మెడికల్ కాలేజీలు తెలంగాణలో మంజూరు చేశారు. 8 మెడికల్ కాలేజీలు ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించనున్నాం. 1500 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీల కోసమే మహబూబ్ నగర్ జిల్లాకు మంజూరు చేసిన ఘనత సిఎం కెసిఆర్ దే” అని పేర్కొన్నారు.
Harish Rao inaugurates 30 beds hospital in MBNR