చిన్నకోడూర్: పదవ తరగతి విద్యార్థులకు అందించిన క్యూ ఆర్ కోడ్ తరహాలోనే ఇంటర్మీడియట్ విద్యార్థులకు నీట్ పరీక్షలకై ట్యాబ్-ఐ పాడ్ అందిస్తానని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం కస్తూరిపల్లి నుంచి ఇబ్రహీంనగర్ వెళ్లే రహదారి మరమ్మత్తు నిర్మాణ పనులకు జెడ్పీ చైర్మన్ రోజాశర్మతో కలసి శుక్రవారం మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం తుర్కకాశ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత రూ.1.32 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్నీ చదువులు సిద్ధిపేటలోనే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. త్వరలోనే సిద్ధిపేటలో బీ ఫార్మసీ, లా కళాశాల తేనున్నట్లు చెప్పారు. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మొదటి స్థానంలో నిలవాలని విద్యార్థులకు మంత్రి సూచించారు. డీఈఓ, ఏంఈఓలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు రూ.10వేలు నగదు పారితోషికం అందిస్తానని, మీరంతా బాసర ఐఐటీలో సీటు పొందాలని మంత్రి ఆకాంక్షించారు. వారం, పది రోజుల్లో ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహం ప్రారంభం కావాలని డీఈఓను మంత్రి ఆదేశించారు.