Wednesday, January 22, 2025

అన్ని రంగాల్లో మనం ముందున్నాం

- Advertisement -
- Advertisement -

Harish Rao Inaugurates new building of IIPH

హైదరాబాద్: రాజేంద్రనగర్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నూతన అకాడమిక్ భవన సముదాయాన్ని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రితోపాటు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, ఐఐపీహెచ్ ప్రెసిడెంట్ శ్రీనాథ్ రెడ్డి, బోర్డ్ డైరెక్టర్, సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. “హైదరాబాద్ లాంటి ప్రధాన నగరంలో ఐఐపిహెచ్ సంస్థ ఉండటం మంచి విషయం. మీ అందరికీ నా అభినందనలు. 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ 45 ఎకరాలు భూమి ఐఐపిహెచ్ కు ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా ప్రజారోగ్యంపై ఆనాడే దృష్టి పెట్టిన సీఎం పది కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రజారోగ్యంపై దృష్టి పెట్టే ఇలాంటి సంస్థ హైదరాబాద్ లో ఉండటం మనకు గర్వకారణం. ఇటీవలి కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రజారోగ్యం మీద బాగా అవగాహన పెరిగింది. ప్రజలు, ప్రభుత్వాలు ప్రజారోగ్య ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాయి. ప్రభుత్వ రంగంలో గానీ, ప్రయివేటు రంగంలో గానీ పెద్ద ఎత్తున ప్రజారోగ్యంపై దృష్టి పెట్టి అవసరమైన అన్ని వసతులు సమకూర్చుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేండ్ల కృషికి మంచి ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి పట్టణ ప్రగతి వల్ల మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు తగ్గాయి.

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆరోగ్య సూచికలలో కూడా గణనీయమైన పురోభివృద్ధి సాధించాం. ఇటీవల రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వైద్యరంగంలో తెలంగాణ చేస్తున్న కృషిని ప్రశంసించింది. నగరాల్లో పట్టణాల్లో స్లమ్ ఏరియాలు ఎక్కువ ఉంటాయి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ బస్తీల సుస్తీ పొగొట్టాలని బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరిగింది. 390 బస్తీ దవాఖానాల ద్వారా పేదలకు వైద్యం అందే ప్రయత్నంలో ఉన్నాం. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే 259 బస్తీ దవాఖానాల ద్వారా వైద్యం అందుతోంది. బస్తీ దవాఖాన పథకం బాగా ఉందని 15వ ఆర్థిక సంఘము ప్రసంశించింది. తెలంగాణలో ప్రజా ఆరోగ్యం బలోపేతానికి 630 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పబ్లిక్ మేనేజ్మెంట్ పర్సన్ నియమించి మరింత మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నాం. అంతేకాకుండా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐటీ వింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం.

తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలపడానికి అవసరమైన నిధులను బడ్జెట్ లో కేటాయించుకున్నం. 6,295 కోట్ల నుండి 11,440 కోట్ల కు పెంచుకున్నం తెలంగాణ వార్షిక బడ్జెట్లో 4.5 శాతం ఆరోగ్య రంగం పైన వెచ్చిస్తున్నాం. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ సంవత్సరం కేవలం 1.1 శాతం మాత్రమే కేటాయించింది. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కడుతున్నం. దానికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. మరో 6 సూపర్ స్పెషలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నాం. సూపర్ స్పెషాలిటీ వైద్యంతో పాటు, వైద్య విద్యను విస్తృతం చేసుకుంటున్నాం. రాష్ట్రంలో అన్ని రంగాల్లో మనం ముందున్నాం. వైద్య ఆరోగ్య రంగంలో కూడా తెలంగాణ దేశానికి దిక్సూచి కావాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష. ఇందుకు మనం చేయి చేయి కలిపి నడుద్దాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ప్రభుత్వానికి శాఖ ప్రజారోగ్య విషయంలో కలిసి పని చేద్దాం. ఇందుకోసం ఆరోగ్యశాఖ సెక్రటరీ నీ ఐఐపిహెచ్ బోర్డు మెంబర్గా నియమించి సమన్వయంతో ముందుకు వెళ్లాలి. అదేవిధంగా హైదరాాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను ఆరోగ్య రంగంలో పెంచుదాం. ప్రపంచం అంతా మన వైపు చూసేలా చేద్దాం” అని అన్నారు.

Harish Rao Inaugurates new building of IIPH

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News