సిద్ధిపేట: ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడమే అంతిమ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. అనాథలు, అభాగ్యులు రోడ్లపై తిరుగుతూ జీవనం సాగిస్తున్న వారి కోసం ప్రభుత్వం రాత్రి బస కేంద్రం(నైట్‌షెల్టర్)ను ఏర్పాటు చేసిందని, ఈ కేంద్రాన్ని సక్రమంగా నిర్వహించాలని మంత్రి హరీశ్ రావు నిర్వాహకులకు సూచించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మణికంఠ నగర్ లో మెప్మా-డీఏవై-ఎన్ యూఎల్ఏం ఆధ్వర్యంలో రూ.72.82 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన పట్టణ నిరాశ్రయుల ఆశ్రయ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, అందుకే సమాజంలోని ఏ ఒక్క పేదలూ ఆకలితో అలమటించకూడదని ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నైట్ షెల్టర్ లో అనాథలకు ప్రతీరోజూ ఉచితంగా టిఫిన్, భోజనం, బెడ్, లాకర్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. అలాగే తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, వినోదం, పచ్చదనం-పరిశుభ్రత వంటి మెరుగైన సౌకర్యాలను కల్పించే దిశగా చర్యలు తీసుకున్నట్లు, ఈ కేంద్రంలో సేద తీరుతున్న పేదల పట్ల సామాజిక సృహతో వ్యవహరించాలని నిర్వాహకులను మంత్రి కోరారు.
Harish Rao inaugurates night shelter in Siddipet