సిద్ధిపేట: కరోనా వ్యాధి వ్యాప్తినీ అరికట్టేందుకు ఇంటింటికీ ఫీవర్ సర్వేను చేపడుతున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట మున్సిపాలిటీ 37వ వార్డు అంబేద్కర్ నగర్-కరీంనగర్ రోడ్డున శనివారం ఇంటింటి ఫీవర్ సర్వే జరుగుతున్న తీరును క్షేత్ర స్థాయిలో మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల దగ్గరికే వైద్య ఆరోగ్య, పంచాయితీ రాజ్, మున్సిపల్ సిబ్బంది వెళ్లి ఫీవర్ సర్వే చేస్తుందని, ప్రజలంతా ప్రభుత్వం చేస్తున్న ఫీవర్ సర్వేకు సహకరించాలని మంత్రి హరీశ్ రావు కోరారు.
ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, కానీ పెద్దగా లక్షణాలు కనిపించడం లేదని తెలిపారు. త్వరలోనే కేసులు తగ్గుముఖం పడతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఫీవర్ సర్వేలో భాగంగా నిన్న మొదటి రోజు 12 లక్షల 68 వేల మంది ఇళ్లకు మున్సిపాలిటీ, పంచాయతీ రాజ్ శాఖ సిబ్బందితో కలిసి 48 వేల మందికి హోమ్ ఐసోలేషన్ కిట్లు అందించినట్లు, వీరికి ఆరోగ్య కార్యకర్తలు నిత్యం ఫోన్ లేదా స్వయంగా వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి, యోగ క్షేమాలు పరిశీలిస్తారని, వ్యాధి తీవ్రత, ఇతర సమస్యలు ఉంటే దగ్గరలోని దవాఖానకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు.
ఇంకా అవసరమైన వైద్యాన్ని ప్రజలకు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, ఎంత మంది ప్రజలు ఆసుపత్రికి వచ్చినా.. అందరికీ వైద్య సేవలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారని తెలిపారు. 5 నుంచి 8 వారాలు ఈ ఫీవర్ సర్వే చేయిస్తారని, కరోనా పరీక్షల కోసం లైన్ ఎక్కువగా ఉన్న చోట్ల మరిన్ని సెంటర్లు పెంపు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఏలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతీ రోజు లక్షకు పైగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నాయని చెప్పారు. 2కోట్ల టెస్ట్ కిట్లు, 1కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్ధంగా ఉన్నాయని, ప్రజలెవరు గాబర పడొద్దని, ఆందోళన చెందొద్దని.. ప్రయివేటు ఆసుపత్రులకు పోవద్దని మంత్రి హరీశ్ రావు ప్రజలకు సూచించారు.
Harish Rao inspects fever survey in Siddipet