Thursday, December 26, 2024

పాలమూరులో 900 పడకల ఆస్పత్రి పనులు ప్రారంభిస్తాం…

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్:  వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. త్వరలోనే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా 900 పడకల ఆసుపత్రి కి శంకుస్థాపన చేస్తామన్నారు.  విద్య, వైద్య రంగాలలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామన్నారు.  మంగళవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ లో 4 కోట్ల 75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 40 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, అదే విధంగా తాలూకా స్థాయిలో ఐసియు బెడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 3 మెడికల్ కళాశాలను మంజూరు చేయడం జరిగిందని, త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా మహబూబ్ నగర్ లో 900 పడకల ఆసుపత్రి పనులు ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. బాల నగర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి ట్రామ కేంద్రాన్ని మంజూరు చేస్తామని, నవాబ్ పేట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం స్థాయి పెంపు కు కృషి చేస్తామన్నారు.

కరోనా నివారణలో భాగంగా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, నూటికి నూరు శాతం వాక్సిన్ తీసుకోవాలని, 15- 17 సంవత్సరాల లోపు పిల్లలందరికీ వాక్సిన్ వేయించాలని, రెండో డోసు పూర్తి చేసుకున్న వారు బూస్టర్ డోసు కూడా వేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో రెండు కోట్ల కరోనా టెస్టింగ్ కిట్లు సిద్ధంగా ఉన్నాయని, కోటి ఐసోలేషన్ కిట్లు కూడా సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు.

2 లక్షల 50 వేల రేమిడివిసి ఆర్ ఇంజెక్షన్లు, ఐసియు బెడ్ లు, వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. ప్రజాప్రతినిధులు కూడా వారు జాగ్రత్తలు తీసుకుంటూనే, ప్రజలలో కరోనా పట్ల అవగాహన కల్పించాలని అన్నారు. రాబోయే 15 రోజులు కేసులు పెరిగేందుకు అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండి పూర్తి జాగ్రత్తలు పాటించాలని కోరారు. అన్ని ఆసుపత్రులలో గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా కరోనా వార్డులు ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలోనే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు చేపట్టడం జరిగిందని, పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని,  వైద్య రంగంతో పాటు, విద్యారంగంలో కూడా రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగానే అంగన్వాడి స్థాయి నుండి ఇంగ్లీష్ మీడియంలో బోధన చేసేందుకు, రాబోయే రోజుల్లో అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాలని నిర్ణయించి 7289 కోట్ల రూపాయలతో మన ఊరు -మనబడి కార్యక్రమానికి ఇటివలే క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. పాఠశాలల్లో అన్ని వసతులతో కార్పొరేట్ తరహాలో విద్యను అందిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తలసరి విద్యుత్ వినియోగం లో నెంబర్ వన్ స్థాయిలో ఉందని, అదే విధంగా తలసరి ఆదాయంలో కూడా ప్రథమ స్థానంలో ఉన్నామని తెలియజేశారు.

 

మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా ఎస్ పి ఆర్.వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, డిఎంఇ రమేష్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సహకార సంస్థ అధ్యక్షుడు సాయిచంద్, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు బాద్మి శివ కుమార్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ యాదయ్య, డిఎంహెచ్ఒ డాక్టర్ కృష్ణ, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు హాజరయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News