Monday, December 23, 2024

పోలియో చుక్కలు వేయించడంలో నిర్లక్ష్యం వద్దు: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని ఇందిరాపార్క్ వద్ద పల్స్ పోలియో కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ”రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ కార్య‌క్ర‌మం మూడు రోజుల పాటు కొన‌సాగుతుంది. ఈ రోజు ఐదేండ్ల‌లోపు పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ సెంట‌ర్ల‌లో పోలియో చుక్క‌లు వేస్తారు. రేపు, ఎల్లుండి సిబ్బంది ఇంటింటికీ తిరిగి, ఇంకా ఎవ‌రైనా పిల్ల‌లు టీకాలు వేసుకోక‌పోతే గుర్తించి అక్క‌డే టీకాలు వేస్తారు. మ‌న జిహెచ్ఎంసి విస్తీర్ణం పెద్ద‌గా ఉంటుంది కాబ‌ట్టి ఇక్క‌డ నాలుగో రోజు కూడా స‌ర్వే కొన‌సాగుతుంది.  జీవితాలను నాశనం చేయ‌గ‌లిగే పోలియో మహమ్మారి నుంచి మ‌న పిల్లలను కాపాడుకోవాలంటే పోలియో చుక్కలు వేయడం ఒక్కటే మార్గం. మ‌నం ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేసినా పిల్ల‌లు శాశ్వ‌తంగా విక‌లాంగులుగా మారిపోతారు. మ‌న‌కు అక్క‌డ‌క్క‌డా పోలియో సోకిన‌వాళ్లు క‌నిపిస్తుంటారు. వాళ్లు ఎంత న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తుంటారో మ‌నం కండ్లారా చూస్తున్నాం. కాబ‌ట్టి మ‌నం చేసే నిర్ల‌క్ష్యం వారి భ‌విష్య‌త్తును స‌ర్వ నాశ‌నం చేస్తుంది. కాబట్టి అప్పుడే పుట్టిన పిల్ల‌ల నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్క‌లు వేయించాలి. రాష్ట్రవ్యాప్తంగా 38 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకోసం రాష్ట్ర‌వ్యాప్తంగా 50 ల‌క్ష‌ల డోసుల‌ను పంపిణీ చేశాం. ఇందుకోసం రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. టీకాల కోసం దూరంగా వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా హెల్త్‌ సెంట‌ర్లతోపాటు అంగ‌న్వాడీ కేంద్రాలు, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, లైబ్ర‌రీలు, బ‌స్టాండ్లు, ఎయిర్ పోర్టులు, ప‌ర్యాట‌క ప్రాంతాల్లో ప్ర‌త్యేక పోలియో వ్యాక్సిన్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశాం. రాష్ట్ర‌వ్యాప్తంగా మొత్తం 23,331 ప‌ల్స్ పోలియో బూత్‌ల‌ను ఏర్పాటు చేశాం. వీరితోపాటు 869 మొబైల్ టీమ్స్‌, బ‌స్టాండ్లు, రైల్వే స్టేష‌న్లు, ఎయిర్ పోర్టులు వంటి ప్ర‌యాణ ప్రాంగ‌ణాల్లో 869 బృందాలు టీకాలు వేయ‌నున్నాయి.

ప‌ల్స్ పోలియోలో 2,337మంది సూప‌ర్ వైజ‌ర్లు, 8,589 మంది ఏఎన్ఎంలు, 27,040 మంది ఆశా కార్య‌క‌ర్త‌లు, 35,353 మంది అంగ‌న్వాడీ టీచ‌ర్లు పాలుపంచుకుంటున్నారు. వీరితోపాటు మ‌హిళా సంఘాల స‌భ్యులు, మెప్మా, సెర్ఫ్ సిబ్బంది, న‌ర్సింగ్ స్టూడెంట్స్‌, టీచ‌ర్లు భాగ‌స్వాములు అవుతున్నారు. వారంద‌రికీ వైద్యారోగ్య‌శాఖ త‌ర‌ఫున ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు. వ్యాక్సినేష‌న్ లో తెలంగాణ ఎప్పుడూ ముందు వ‌రుస‌లో ఉంటుంది. ముఖ్యంగా పిల్ల‌ల‌కు వ్యాక్సినేష‌న్ లో తెలంగాణ దేశానికే ఆద‌ర్శంగా ఉంది. నీతి ఆయోగ్ సైతం ఇదే చెప్పింది. ఇటీవ‌ల విడుద చేసిన హెల్త్ ఇండెక్స్‌లో తెలంగాణ‌లో 100శాతం మంంది పిల్ల‌ల‌కు వ్యాక్సిన్లు వేస్తున్నార‌ని స్ప‌ష్టంగా చెప్పింది. కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీలోనూ తెలంగాణ ముందు వ‌రుస‌లో ఉంద‌ని మ‌నకు తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు ప‌క్కా ప్ర‌ణాళిక రూపొందించి, కొవిడ్ టీకాల పంపిణీ చేప‌ట్టాం. ఫ‌లితంగా రికార్డు స‌మ‌యంలో మొద‌టి డోస్ వంద శాతం పూర్తి చేశాం. దీంతో ఈ ఘ‌న‌త సాధించిన దేశంలోని మొద‌టి పెద్ద రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అంతేకాదు.. మన క‌రీంన‌గ‌ర్ జిల్లా రెండు డోసులు వంద శాతం పూర్తి చేసుకొని, ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఈ రికార్డు సాధించిన రెండో జిల్లాగా ఖ్యాతి కెక్కింది. క‌రోనా బారి నుంచి టీకా మ‌న‌ల్ని ఎలా ర‌క్షిస్తున్న‌దో.. మ‌న పిల్ల‌ల‌ను పోలియో మ‌హ‌మ్మారి బారి నుంచి పోలియో చుక్క‌లు ర‌క్షిస్తాయి. మ‌నం వేయించే రెండు చుక్క‌ల వ్యాక్సిన్‌.. వారి నిండు జీవితానికి భ‌రోసా ఇస్తుంది” అని అన్నారు.

Harish Rao launches Pulse Polio drive at Indira Park

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News