Sunday, December 22, 2024

ప్రంపంచానికే తెలంగాణ వ్యాక్సిన్ హబ్ గా మారింది: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

Harish Rao launches vaccine for 12-14 age

హైదరాబాద్: ప్రంపంచానికే తెలంగాణ రాష్ట్రం వ్యాక్సిన్ హబ్ గా మారిందని, కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి చేయాలంటే ఇప్పుడు ప్రపంచం తెలంగాణ వైపు చూసే పరిస్థితి ఉందని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. బుధవారం ఖైరతాబాద్ లో 50 పడకల సిహెచ్ సి ఆసుపత్రితో పాటు 12-14 ఏండ్ల మధ్య వయసున్న పిల్లలకు టీకాలు వేసే కార్యక్రమం మంత్రి హరీశ్ రావు ప్రారంబించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  ”నేషనల్ వ్యాక్సిన్ డే అయిన మార్చి 16వ తేదీన 12-14 ఏళ్ల పిల్లలకు టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉంది. దేశ వ్యాప్తంగా టీకాల కార్యక్రమం నేటి నుండి మొదలవుతుంది. హైదరాబాద్ కి చెందిన బయాలజికల్ ఇ లిమిటెడ్ అభివృద్ధి చేసిన కొర్బేవాక్స్ టీకాను అర్హులైన పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రపంచానికి తెలంగాణ రెండు టీకాలను అందించింది. మొదటిది భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ అయితే.. రెండోది బయోలాజికల్ ఈ తయారు చేసిన కార్బొవ్యాక్స్.

కరోనా థర్డ్ వేవ్ ముగిసిందనో.. థర్డ్ వేవ్ లో పెద్దగా ప్రభావం చూపలేదనో.. కొత్త వేరియంట్ ఇప్పుడు వస్తుందా? రాదా? అనే అనుమానాలతో టీకాలు వేసుకోవడంలో నిర్లక్ష్యం చేయవద్దు. కొవిడ్ ప్రభావం తగ్గిందే తప్ప వైరస్ పూర్తిగా అంతం కాలేదు. ముందస్తుగా టీకాలు వేసుకుంటే మన ఆరోగ్యానికి భరోసాగా ఉంటుంది.ఈ వయస్సు వర్గం వారు రాష్ట్రంలో 17,23,000 ఉంటారని అంచనా వేయడం జరిగింది. 15 మార్చి 2010 తేదీకి ముందు జన్మించిన పిల్లలు వాక్సిన్ తీసుకునేందుకు అర్హులు.అన్ని ప్రభుత్వ పీహెచ్ సీలు, యూపీహెచ్ సీల్లో వాక్సినేషన్ అందించటం జరుగుతుంది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు వైద్యారోగ్య శాఖ ఏర్పాటు చేసింది. తల్లిదండ్రుల సమక్షంలో వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. 12-14 ఏండ్ల మధ్య వయసువారికి కార్బొవ్యాక్స్ వేస్తున్నాం. మన దేశంలో ఈ వయసు పిల్లలకు వేసేందుకు అనుమతి పొందిన ఏకైక టీకా కార్బొవ్యాక్స్. దీనిని అభివృద్ధి చేసిన బయోలాజికల్-ఈ తెలంగాణ కంపెనీ కావడం మనందరికీ గర్వకారణం” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, డిఎంఇ రమేష్ రెడ్డి, డిహెచ్ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

Harish Rao launches vaccine for 12-14 age

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News