Monday, January 20, 2025

సంక్షేమానికి బిఆర్‌ఎస్ అభయహస్తం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఆదిభట్ల: జనరంజక పాలనతో సిఎం కెసిఆర్ దీపంలా వెలుగుతుండగా పాపంలాంటి బిజెపి, శాపం లాంటి కాంగ్రెస్ ఎందుకని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గపరిధిలో పలు అభివృద్ధి పనులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా పెద్దచెరువుకట్ట నుంచి బైపాస్‌రోడ్డు వరకు నూతనంగా నిర్మించిన రోడ్డును ఆయన ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్, అనంతరం రామోజీ ఫిల్మ్‌సిటీ సౌజన్యంతో నిర్మించిన ఆర్‌డివో కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా బొంగ్లూర్‌లోని కళ్లెం జంగారెడ్డి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ రైతులకు 24 గంటల కరెంట్ వద్దంటుంటే మరోపక్క బిజెపి మోటార్లకు మీటర్లు బిగించి రైతుల నడ్డివిరిచే ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు. సిఎం కెసిఆర్ మూడు పంటలకు సాగునీరు అందిస్తానం టుంటే, కాంగ్రెస్ నాయకులు మాత్రం మూడు గంటలే చాలం టున్నారని, నిర్ణయించుకోవాలని హరీశ్ రావు సూచించారు. గృహలక్ష్మి ద్వారా మంజూరయ్యే డబ్బులను ఇంటి యజమానురాలికే ఇవ్వాలని కెసిఆర్ ఆదేశించారని ఇలా ఏ కార్యక్రమం చేపట్టినా మొదట మహిళలకే సిఎంప్రాధాన్యత ఇస్తున్నారని హరీశ్ పేర్కొన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందని, అక్కడ రైతులకు 8 గంటల కరెంట్ రావ డం లేదని, బెంగళూరులో నాలుగు గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారని హరీశ్ తెలిపారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద రైతులకు రూ. 72వేల కోట్ల రూపాయలు అందజేసిందని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. బాలింతలకు కెసిఆర్‌కిట్, గర్భిణులకు ఆరోగ్యలక్ష్మి, అమ్మవడి పథకాలను అందిస్తున్నామని అన్నారు. న్యూట్రిషన్ కిట్‌తో సామాన్యుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరందిస్తున్నామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో తాగునీటి కోసం నల్లాల వద్ద మహిళలు పడిన తంటాలను ఆయన గుర్తుచేశారు. మహిళాభ్యుదయమే లక్షంగా వడ్డీలేని రుణాలను అందిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే అభయహస్తం నిధులు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.

గత ప్రభుత్వాలు విస్మరించిన వివోఏలు, ఆర్‌పిల డిమాండ్‌లను నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. సుమారు 36వేల కోట్ల రుణమాఫీ చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 80 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. సిఎం కెసిఆర్ సారథ్యంలో రాష్ట్రం అన్నిరంగాల్లోనూ ప్రగతిపథంలో దూసుకుపోతోందని ఆయన అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం జనరంజక పాలనను అందిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జడ్పిఛైరపర్సన్ తీగల అనితాహరినాధ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఎంపిపి కృపేష్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ కప్పరి స్రవంతిచందు, ఏఎమ్‌సిఛైర్మన్ ఏర్పుల చంద్రయ్యలతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, బిఆర్‌ఎస్‌నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News