రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్‌రావు, ఎంఎల్‌ఎ పద్మారావు శుక్రవారం కలిశారు. అలాగే మాజీమంత్రి మల్లారెడ్డి, తన కుమారుడు భద్రారెడ్డితో కలిసి సిఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై హరీష్‌రావు చర్చించారు. ఈ భేటీ అనంతరం అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో హరీష్‌రావు చిట్‌చాట్‌గా మాట్లాడారు. సీతాఫల్‌మండిలో పెండింగ్‌లో ఉన్న ఎస్‌డిఎఫ్ నిధుల కోసం పద్మారావుతో కలిసి సిఎంను కలిశానని చెప్పారు. సీతాఫల్‌మండి హైస్కూల్, జూనియర్, డిగ్రీ కళాశాల ఒకే చోట ఏర్పాటు చేసేందుకు బిఆర్‌ఎస్ హయాంలో రూ.32 కోట్లు విడుదల చేసినట్లు గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ రాగానే నిధులు ఆగిపోయాయని చెప్పారు. కెసిఆర్ కేటాయించిన పనులను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అర్థాంతరంగా ఆపేసిందని హరీష్‌రావు పేర్కొన్నారు.
డీలిమిటేషన్‌పై కాంగ్రెస్ పార్టీకి క్లారిటీ లేదు..
కాంగ్రెస్, బిజెపి పార్టీల ‘బడే భాయ్.. చోటే భాయ్ బంధం’ అసెంబ్లీ సాక్షిగా సిఎం రేవంత్‌రెడ్డి బయటపెట్టారని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.కేంద్రం నిధుల విడుదలలో తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపిందని, అయినా ఏమీ అనకుండా బడేభాయ్‌తో ఉన్న బంధాన్ని అసెంబ్లీ సాక్షిగా చెప్పారని విమర్శించారు. కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వకపోయినా.. తన ప్రసంగంలో డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క పల్లెత్తు మాట అనలేదని అన్నారు. కాంగ్రెస్, బిజెపికి తాము సమాన దూరంగా ఉంటామని, రెండు పార్టీలతోనూ పోరాటం చేస్తామని చెప్పారు.బిఆర్‌ఎస్ పార్టీది తెలంగాణ ప్రజల పక్షం అని పునరుద్ఘాటించారు. బిజెఎల్‌పి నేత ఏలేటి మహేశ్వర రెడ్డి కాంగ్రెస్ కంటే.. సభలో బిఆర్‌ఎస్‌ను ఎక్కువ టార్గెట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
బిజెపి,- కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై బిఆర్‌ఎస్ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఎవరెన్ని బురద చల్లినా ప్రజలకు వాస్తవాలు తెలుసు అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిపై తాను మాట్లాడినంత గట్టిగా ఎవరూ మాట్లాడలేదని చెప్పారు. తాను రేవంత్ బట్టలు విప్పితే.. మహేశ్వరరెడ్డి రేవంత్‌ను కవర్ చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పిలిస్తే పోవటం లేదని డిఎంకే నేతల ఆహ్వానం మేరకు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చెన్నై వెళ్లారని పేర్కొన్నారు. దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపై మెదట మాట్లాడిందే బిఆర్‌ఎస్ పార్టీ అని గుర్తుచేశారు. డీలిమిటేషన్‌పై కాంగ్రెస్ పార్టీకి ఓ స్టాండ్ లేదు… క్లారిటీ లేదని హరీష్‌రావు విమర్శించారు.