Friday, January 31, 2025

కాంగ్రెస్ పాలనలో బిల్డర్లూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు:హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్‌లో ఫ్లాట్లు అమ్ముడు పోలేదని మేడ్చల్ జిల్లాలో బిల్డర్ ఉరేసుకునే పరిస్థితి రావడం శోచనీయమని మాజీ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు.. ఇప్పుడు బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆత్మహత్యలన్నిటికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్ నిర్లక్ష్య పాలన, అనాలోచిత అసమర్థ విధానాలే కారణమని అన్నారు. శాంతి భద్రత దిగజారడం,పాలన పట్ల ప్రజల్లో నమ్మకం లేకపోవడం, అనుమతి ఉన్న ఇళ్లను సైతం హైడ్రా కూల్చివేయడం, మూసి, ఫార్మా సిటీ, మెట్రో కారిడార్ల విషయంలో ద్వంద్వ ప్రకటనలు,ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చేయకపోవడం, భవన నిర్మాణ అనుమతులకు బలవంతపు వసూళ్లు చేయడం,

కొత్త పెట్టుబడులు రాకపోవడం, ఇతర రాజకీయ, ఆర్థిక పరిణామాలు రియల్ ఎస్టేట్ రంగంపై గడిచిన 14 నెలల కాంగ్రెస్ పాలనలో పెను ప్రభావాన్ని చూపాయని తెలిపారు. ఒకప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం అంటే బిల్డర్లకు స్వర్గధామం అని ఇప్పుడు బిల్డర్లకు నరకకూపం అయ్యిందని చెప్పారు. ’నేను రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చాను, రియల్ ఎస్టేట్ గురించి నాకు చెప్తారా?’ అని మీడియా సమావేశంలో దబాయించిన సిఎం రేవంత్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగాన్ని చేజేతులా నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి ఇరుసుగా ఉన్న వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని ధ్వంసం చేశారని, హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్ అయిన రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని అన్నారు. ఇప్పటికైనా మేల్కోకపోతే పదేళ్లుగా పురోభివృద్ధిలో ఉన్న తెలంగాణ, తిరోగమనం బాట పట్టే ప్రమాదం ఉందని హరీష్‌రావు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News