Wednesday, January 22, 2025

ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ పనులు త్వరితగతిన పూర్తి చేయండి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

నంగునూరు: అత్యాధునిక టెక్నాలజీ, అన్ని వసతులతో సిద్దిపేట జిల్లా, నంగునూరు మండలం, నర్మెటలో చేపట్టిన పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ తన్నీరు హరీష్ రావు అధికారులను ఆదేశించారు. పామాయిల్ ఫ్యాక్టరీ పనులను శుక్రవారం ఆయిల్ ఫెడ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిఎస్ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో అత్యాధునిక టెక్నాలజీ, అన్ని వసతులతో కూడిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో నూనె ఉత్పత్తి చేయడమే కాదు, రిపైనరీతో ఫైనల్ ప్రొడక్ట్‌ను ఇక్కడ నుండే నేరుగా మార్కెట్‌లోకి పంపించవచ్చునని తెలిపారు. దీనికి కావాల్సిన 4 మెగావాట్ల సెల్ఫ్ జనరేషన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశామని అన్నారు. వాడిన నీటిని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా రీసైకిల్ చేసే పద్ధతిని ఇక్కడ ఏర్పాటు చేశామ వివరించారు.

మూడేళ్ల క్రితం ఆయిల్ పామ్ పంటను పెట్టిన రైతుల నుండి ఈ జూన్ వరకు పంట దిగుబడి రానున్నదని అన్నారు. రానున్న 5 నెలల్లో పంట ఉత్పత్తి ప్రారంభం కానున్నందున పంట కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ఆయిల్ పామ్ కు సంబంధించిన రవాణా ఖర్చును వ్యవసాయ భూమి నుండి నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వరకు పామయిల్ ఫ్యాక్టరీనే చెల్లిస్తుందని తెలిపారు. ఆయిల్ పామ్‌కు మెట్రిక్ టన్నుకు కనీసం 15 వేలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెస్తున్నామని, ఆపైన కూడా మద్దతు ధర ఇస్తే ఇంకా బాగుంటుందని కోరినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడం వలన విదేశాల నుండి మన దేశానికి పెద్ద మొత్తంలో దిగుమతి అవుతోందని, దీని ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని కోల్పోతున్నామనని అన్నారు.

ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే ఆయిల్‌పై సెస్ విధిస్తే మన రైతుల ఆయిల్ పామ్‌కు ధర పెరిగి లాభం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. పామాయిల్ రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, జూన్ నుండే మన నర్మెటలో పంటను కొనుగోలు చేసి అశ్వరావుపేటకు పంపిస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేట లో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్‌కు చెందిన అధికారిని అపాయింట్ చేశామని, రైతులకు కావాల్సిన సూచనలు సలహాలు ఇస్తారని తెలిపారు. ఆయిల్ పామ్‌లో అంతర్ పంటగా నాటు కోళ్లు, ఇతర పంటలను వేసుకొని అధిక ఆదాయం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News