చేసింది చెప్పుకోవడంలో మేం ఫెయిల్
అయ్యాం వైఫల్యాలను
ఎత్తిచూపుతున్నందుకే నాపై వ్యక్తిగత
దూషణలు మా ఫోన్లను ట్యాప్
చేస్తున్నారు చావుకైనా సిద్ధం తప్ప
రేవంత్‌కు లొంగే ప్రసక్తే లేదు
మన తెలంగాణ ప్రత్యేక ఇంటర్వూలో
బిఆర్‌ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి
తన్నీరు హరీశ్‌రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : రేవంత్ రె డ్డి ఏడాది పాలనలో దబాయింపులు .. బుకాయింపులు..ఫిరాయింపులు..ఈ మూడే జరుగుతున్నాయని బిఆర్‌ఎస్ పార్టీ అగ్రనేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీష్‌రావు వ్యాఖ్యానించారు. ఎంఎల్‌ఎ పార్టీ మారనంటే అక్రమ కేసులు పె డుతున్నారని ఆరోపించారు. పటాన్‌చె రు ఎంఎల్‌ఎపై మైనింగ్ కేసు పెట్టారు.. గ ద్వాల ఎంఎల్‌ఎపై మైనింగ్ కేసు ఉన్నదని ఆ ర్డర్ చూపించి బెదిరించారన పేర్కొన్నారు. ఎం ఎల్‌ఎల కుటుంబ సభ్యులను, వాళ్ల వ్యాపారాలను, వాళ్లను వ్యక్తిగతంగా వేధిస్తూ దబాయిం చి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వం ద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అ ని చెప్పి, ఆ గ్యారంటీ అమలు ఏమైదంటే సిఎం బుకాయిస్తడు. బాండ్ పే పర్ మీద రేవంత్‌రెడ్డి, భట్టి వి క్రమార్క సంతకాలు పెట్టా రు.. తల్లిగా మాట ఇస్తు న్నా ఆరు గ్యారంటీలు అమలు చేసే బాధ్యత త నది అని సోనియా గాం ధీ చెప్పారు. మొదటి అ సెంబ్లీలోనే ఆరు గ్యారంటీలకు చట్టభద్దత చేస్తానని రాహుల్‌గాంధీ చెప్పారు..కానీ ఇప్పటివరకు ఆరు గ్యా రంటీలకు చట్టభద్దత తేలేదు అని అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్నసందర్భంగా“మనతెలంగాణ”కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో హరీశ్‌రావు స్పందించారు. ముఖ్యాంశాలు హరీష్‌రావు మాటల్లోనే ఆరు గ్యారంటీల ఆశ చూపి మోసం చేసినందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రజానీకానికి భేషరతుగా క్షమాపణ చెప్పాలి. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనందుకు, ఆరు గ్యారంటీలు అమలు చేయనందుకు చెంపలేసుకుని క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు ఎందుకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు..ఆరు గ్యారంటీలు అమలు చేయనందుకు ఉత్సవాలా..?…ఏడో గ్యారంటీ అయిన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినందుకా..? ..గిరిజనులను జైలులో పెట్టినందుకా..?..నిరుద్యోగ యువత గొంతు నొక్కినందుకా..?…అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్లు కూడా రెండు నెలలు ఎగ్గొట్టినందుకా..?…ఆరు గ్యారంటీల్లో మొదటి గ్యారంటీ మహిళలకు రూ.2500 రాలేదు..అలాగే రైతులకు రూ.15 వేల రైతు భరోసా రాలేదు..ఇప్పటివరకు ఒక్క ఇళ్లు కూడా మంజూరు కాలేదు..రూ.4 వేల పెన్షన్లు…విద్యార్థులకు భరోసా కార్డు రాలేదు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్యం అని వాళ్ల మెనిఫెస్టోలో రాశారు…కానీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా..?..హక్కుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులను, మా భూములు మాకు కావాలని అన్న గిరిజనలపై అర్థరాత్రి పూట దాష్టీకానికి పాల్పడి వారిని అరెస్ట్ చేశారు. ఇప్పటికీ గిరిజనులు జైలులో ఉన్నారు. చివరికి ప్రజాసంఘాలు లగచర్లకు నిజనిర్థారణకు వెళతామంటే పిఒడబ్లూ సంధ్య, ఇతర నేతలకు నడిరోడ్డు మీద అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడికి పోతే అక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.
ప్రతిపక్షాల మీద నెపం పెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారు
ప్రభుత్వం వైఫల్యాలను ప్రతిపక్షాల మీద నెపం పెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారు. నిరుద్యోగ యువత రోడ్డు మీదకు వస్తే ప్రతిపక్షమే వారిని రెచ్చకొడుతుందని అంటడు..లగచర్లలో మా భూముల మాకు కావాలంటే ప్రతిపక్షం ఆ నెపం ప్రతిపక్షంపై నెట్టుతారు..రెసిడెన్షియల్ స్కూళ్లలో పిల్లలు విషాహారం తిని చనిపోతున్నారంటే ప్రతిపక్షం కుట్ర ఉందంటారు..మా పార్టీ నేతల హస్తం ఉంటే చర్యలు తీసుకో..ప్రభుత్వం రేవంత్‌రెడ్డి చేతిలోనే ఉంది కదా..?..గురుకులాలను మూసి వేయడానికి రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారు. ముక్కుపచ్చలారని పిల్లలకు బుక్కెడు అన్నం పెట్టలేనోడు మూసీని ఉద్దరిస్తాడా..?
ఇది కూల్చివేతల ప్రభుత్వం
ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇళ్లు కూడా కట్టలేదు. ఇది ఇళ్లు కట్టే ప్రభుత్వం కాదు..ఇండ్లు కూల్చే ప్రభుత్వం..హైడ్రా పేరిట, మూసీ ప్రక్షాళన పేరిట రకరకాలుగా పేదలను వేధిస్తూ వాళ్లు ఇండ్లు కూల్చినవు తప్ప ఏడాదిలో ఒక్క ఇళ్లయినా కట్టారా..?. చివరికి మూసీ పేరు మీద సిఎం ఇండ్లూ కూల్చిన బాధితులకు కెసిఆర్ కట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్లే ఇచ్చారు తప్ప ఒక్క ఇళ్లయితే కట్టలేదు.
తెలంగాణ విగ్రహం, లోగో, టిజీగా మార్పు వల్ల ఎవరికి ఉపయోగం..?
తెలంగాణ తల్లి విగ్రహాన్ని, టిఎస్‌ను టీజీగా మార్చడం, లోగోలను మార్చడం అనేది తెలివితక్కువ పని. వీటిని మార్చడం వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకపోగా, వారిపై అదనపు భారం పడుతుంది. రాష్ట్రంలో కొన్ని లక్షల తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి…తెలంగాణ తల్లి రూపం మార్చితే ..అవన్నీ మారుస్తారా..?.. ఇచ్చిన హామీలు అమలు చేసి, ప్రజల బతుకుదెరువు మార్చితే ప్రజలు మెచ్చుతారు..కానీ ఈ మార్పుల వల్ల ఎవరికి ఉపయోగం లేదు.
పార్టీ ఫిరాయింపులను ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ
పార్టీ ఫిరాయింపులను ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ..2004లో తమ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే తమ పార్టీ నుంచి 26 మంది ఎంఎల్‌ఎలు గెలిచాం, కానీ వైఎస్‌ఆర్ టిఆర్‌ఎస్‌కు చెందిన 14 మంది ఎంఎల్‌ఎలను గుంజుకున్నారు. పొత్తు పెట్టుకున్న మిత్రపక్ష పార్టీని చీల్చారు. న్యాయస్థానాలపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎంఎల్‌ఎల అనర్హత విషయంలో కొంత ఆలస్యమైనా ఎంఎల్‌ఎలు అనర్హులు కాక తప్పదు. మహారాష్ట్ర, మణిపూర్ విషయంలో గతంలో వచ్చిన తీర్పుల వల్ల చాలామంది అనర్హులయ్యారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళతాం.
ఇదీ బిజెపితో కాంగ్రెస్‌కు ఉన్న రహస్య ఒప్పందం
బడే బడే బాయి బడే బడే బాయి అంటూ మోడీని బహిరంగ సభల్లో వేడుక్కంటూ బిజెపితో కుమ్మక్కయింది రేవంత్‌రెడ్డి. ఆదానీతో చెట్టపట్టాలేసుకుని అగ్రిమెంట్లు చేసుకున్నది ఆయన. బిజెపి నాయకులు బండి సంజయ్ రేవంత్‌రెడ్డి మంచోడు..కాంగ్రెస్, బిజెపి కలిసి కలిసి బిఆర్‌ఎస్ ఖతం చేద్దామని బహిరంగంగా మాట్లాడారు. ఎంపీ ధర్మపురం అరవింద్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు బహిరంగంగానే రేవంత్‌రెడ్డికి మద్దతుగా మాట్లాడారు..ఇదీ బిజెపి, కాంగ్రెస్ మధ్య ఉన్న రహస్య ఒప్పందం. కానీ బిఆర్‌ఎస్‌తో బిజెపికు రహస్య ఒప్పందం ఉందంటూ దొంగే దొంగా దొంగా అన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు బిజెపికి ఓట్లు వేశారు..భవిష్యత్తులో జరగబోయే శాసనసభ ఎన్నికలు అయినా,లోకల్‌బాడీ ఎన్నికలు అయినా తప్పకుండా ప్రజలు బిఆర్‌ఎస్ వైపే ఉంటారు..బిజెపిది బలుపు కాదు..వాపు.
రేవంత్‌రెడ్డి హయాంలో తెలంగాణ దివాళా రాష్ట్రంగా మారింది
కెసిఆర్‌ది ఎప్పుడూ సానుకూల దృక్పథం…తెలంగాణ ధనిక రాష్ట్రం అని, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. కెసిఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారింది. కానీ నెగెటివ్ దృక్పథంతో ఆలోచించే రేవంత్‌రెడ్డి హయాంలో దేశం దృష్టిలో తెలంగాణ దివాళా రాష్ట్రంగా మారింది. రాష్ట్రం దివాళా తీసిందని ముఖ్యమంత్రే అసెంబ్లీలో చెప్పుతుంటారు. కెసిఆర్ మొదటిసారి బడ్జెట్ పెట్టినప్పుడు రాష్ట్ర బడ్జెట్ రూ.62 వేల కోట్లు..దిగిపోయే నాటికి రాష్ట్ర బడ్జెట్ రూ.3 లక్షల కోట్లకు పెరిగింది. ప్రజలు తిరగబడుతున్నారని అర్థమైపోయి రేవంత్‌రెడ్డి ప్రజలకు బ్రతిమాలుకునే పరిస్థితికి వచ్చారు. రేవంత్‌రెడ్డి తన పాలన ఫెయిలైందని, ఆయన గ్రాఫ్ పడిపోయిందని పరోక్షంగా ఒప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి మాటలు విని ఆయన ట్రాప్‌లో పడ్డామని ప్రజలు ఇప్పుడిప్పుడే అనుకుంటున్నారు. రేవంత్ మాటలే ఆయన బలం…ఆయన మాటలే ఆయన బలహీనత. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మాటలు..ఆయన బలంగా మారాయి..ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన మాటలు ఆయన బలహీనతగా మారాయి.
నిజాలు భయటకి రాకుండా అక్రమ కేసులు పెడుతున్నారు
ప్రతిపక్షంగా ఉన్నప్పుడు సోషల్ మీడియా వాళ్లు గొప్పవాళ్లు..వాళ్లే నిజమైన దేశభక్తులు అని రేవంత్‌రెడ్డి అన్నారు..ఇప్పుడు అదే సోషల్ మీడియా వాళ్లను పట్టుకుని చిల్లరగాళ్లు..అంటూ వాళ్ల మీద కేసులు పెడుతున్నారు..సోషల్ మీడియాలో ఏదైనా వస్తే బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా తప్పయితే సమాధానం చెప్పాలని అన్నారు. నిజాలు బయటకి రాకుండా ముందుగా బుజ్జగిస్తున్నరు..వినకపోతే అక్రమ కేసులు పెట్టి సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు.
నిరుద్యోగ యువతకు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి
సిఎం రేవంత్‌రెడ్డి 52 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు ఘనంగా ప్రకటనలు ఇచ్చుకున్నారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 12 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వగా, జరిగిన నియామకాలు 6 వేలు మాత్రమే. మిగతా ఉద్యోగాలు అన్నీ కెసిఆర్ హయాంలోనే నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించి, ఫలితాలు ప్రకటించి తేది దశలో ఉన్నవాటికి కేవలం పోస్టింగ్ ఆర్డర్‌లు మాత్రమే ఇచ్చి ఆంతా తామే ఇచ్చారని చెప్పుకుంటున్నారు. కెసిఆర్ 1.60 లక్షల ఉద్యోగాలు ఇస్తే, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని గోబెల్స్ ప్రచారం చేశారు. ఇప్పుడు ఇచ్చిన 52 వేల ఉద్యోగాలలో 46 వేల ఉద్యోగాలు కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చింది. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఇచ్చిన హామీ నెరవేర్చనందుకు నిరుద్యోగ యువతకు రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ క్షమాపణ చెప్పాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను బిఆర్‌ఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందని సిఎం రేవంత్‌రెడ్డి అన్న మాటలలో వాస్తవం లేదు. మా హయాంలో సమాజంలో అత్యంత గౌరవం ఉన్న ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని, నిజాయితీ కలిగిన ఐఎఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్న జనార్థన్‌రెడ్డిని చైర్మన్‌లుగా నియమించాం. 1.60 లక్షల ఉద్యోగాలు ఏ న్యాయపరమైన సమస్యలు లేకుండా భర్తీ చేసింది మేమే కదా..?..యువతను రెచ్చగొట్టి కేసులు వేయించింది కాంగ్రెస్ పార్టీ.
చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యాం
బిఆర్‌ఎస్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు చెప్పుకునే విషయం తాము ఫెయిలయ్యాం. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గోరంతను కొండత చేసుకుని ప్రచారం చేసుకుంటుంది. 24 ఉద్యోగాలు ఇచ్చినా ముఖ్యమంత్రి నియామక పత్రాలు ఇస్తున్నారు…కానీ మా హయాంలో 20 వేల ఉద్యోగాలు ఇచ్చినా ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి కూడా నియామక పత్రాలు ఇవ్వలేదు. నిజం నిలకడగా తెలుస్తంది అన్నట్లుగా ఇప్పుడిప్పుడే ప్రజలకు తెలిసి వస్తుంది. వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ రైతులకు తొమ్మిది హామీలు ఇచ్చారని అందులో ఏ ఒక్కటైనా అమలయ్యిందా…?
ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉండి ఏడుగురు ప్రాణాలు కాపాడలేకపోయారు
వరదల్లో ప్రజలు కొట్టుకుపోతుంటే హెలికాప్టర్ పంపలేక చేతకాక ప్రజలను పొట్టన పెట్టుకున్న ప్రభుత్వం..ఇది ఒక ఓ ఫెయిల్యూర్ ప్రభుత్వం…ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉండి ఏడుగురు ప్రాణాలు కాపాడలేకపోయారు. చీటికి మాటికి హెలికాప్టర్‌లో తిరిగే మంత్రులు వరదల్లో ప్రజలు చిక్కుకుపోతే వారిని కాపాడటానికి హెలికాప్టర్ పంపలేకపోయారు.
ప్రధాన ప్రతిపక్షంగా మేం విజయం సాధించాం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బిఆర్‌ఎస్ సక్సెస్ అయ్యింది. ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు మేము గట్టిగా పోరాటం చేస్తే అప్పుడు బాధితులకు డబ్బులు ఇచ్చారు..మేం గట్టిగా ఒత్తిడి తెస్తే పంట పొలాలకు ఎకరానికి రూ.10 వేలు ఇచ్చారు..రుణమాఫీ విషయంలో నేను వేసిన బహిరంగ సవాల్ కారణంగానే రూ.20 వేల కోట్లు రుణమాఫీ చేశారు. మద్యం ధరలు పెంచకుండా కట్టడి చేశాం. గురుకుల పాఠశాలల్లో జరుగుతున్న అరాచకాల మీద ప్రశ్నిస్తే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లను వేశారు. హైడ్రా, మూసీ మీద బిఆర్‌ఎస్ పోరాటం తర్వాతనే కూల్చివేతలు ఆగినయి…ప్రధాన ప్రతిపక్షంగా మేం విజయం సాధించాం.
రేవంత్‌రెడ్డిని గద్దె దించే వరకు నా పోరాటం ఆగదు
ఏడాది పాలనలో రేవంత్‌రెడ్డి పాలనను ఎండగడుతూ, వైఫల్యాలను ఎత్తిచూపుతున్నాను కాబట్టి నాపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. రేవంత్‌రెడ్డి, నా కుటుంబ సభ్యులను టార్డెట్ చేస్తున్నారు. నా పి.ఎలు, నా సిబ్బంది అందరి కదలికలపై నిఘా పెట్టారు. మా ఫోన్లు అన్నీ ట్యాప్ చేస్తున్నారు. నాపై వంద మందిని పెట్టి విచారణ చేయిస్తున్నారు..ఎక్కడైనా ఒక తప్పు దొరకకపోతదా..? అని డిఎస్‌పి, సిఐలతో విచారణ చేయిస్తున్నారు..ఏదో రకంగా గొంతు నొక్కాలని చూస్తున్నారు. నేను సంతకాలు పెట్టిన ఇరిగేషన్ పైళ్లు వెయ్యికి పైగా తెప్పించుకుని ఏమైనా తప్పు దొరకదా అని వెతుకున్నారు. చావుకైనా సిద్ధం తప్ప..కాంగ్రెస్‌కు, రేవంత్‌రెడ్డికి లొంగే ప్రశ్నే లేదు. ప్రజాక్షేత్రంలో రేవంత్‌రెడ్డి విధానాలను ఎండగట్టి ప్రజల ద్వారా ఆయనను గద్దె దించే వరకు నా పోరాటం ఆగదు.
కెసిఆర్ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని అనుకున్నారు
కెసిఆర్ పెద్ద మనిషి తరహాలో ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని అనుకున్నారు. త్వరలోనే ప్రజాక్షేత్రంలో వస్తారు. శాసనసభలో, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారు. ఏడాది పాలనలో రేవంత్‌రెడ్డి విధానాల గురించి ప్రజలకు అర్థమైంది. రైతుల ఆత్మహత్యలు, ఆటో కార్మికుల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతుతండటం బాధాకరం. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు..దయచేసి ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు..ఆయా వర్గాల సమస్యలను బిఆర్‌ఎస్ పార్టీ దృష్టికి తీసుకువస్తే వారి న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తాం.