రాష్ట్రంలో భూగర్భజలాల గణనీయంగా తగ్గుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు గ్రామాల్లో బిందెలు పట్టుకుని తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని భూగర్భజలాల సంరక్షణలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదర్శంగా నిలిపిందని, ప్రస్తుత ఏడాది కాంగ్రెస్ పాలనలో నీటి ప్రణాళికల నిర్వహణలో పూర్తిగా వైఫల్యానికి గురవుతున్నాయి ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పాలన తెలంగాణను నీటి సంక్షోభం వైపు నెట్టింది, బలమైన నీటిపారుదల వ్యవస్థను ప్రభుత్వ నిర్లక్ష్యంతో పతనం అవుతోంది, రిజర్వాయర్లలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి నీటి పరిరక్షణ చర్యలు తీసుకోకపోతే రాబోయే నెలల్లో రాష్ట్రం మరింత తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కోవాల్సి వస్తుందని హరీశ్‌రావు వివరించారు.
మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో 2013 నుంచి 2023 వరకు భూగర్భజలాలు 56 శాతం మేరకు పెరిగాయని, మిషన్ కాకతీయ ద్వారా 27వేలకుపైగా చెరువులను పునరుద్ధరించడంతో దాదాపు 15 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందని, నాడు 8.93 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం పెరిగిందని హరీశ్‌రావు వివరించారు. కానీ, కేవలం 14 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఈ వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యంతో రెండు మీటర్లకు పైగా భూగర్భజలాలు పడిపోయాయని, యాదాద్రి భువనగిరిలో 2.71 మీటర్ల భారీ తగ్గుదల నమోదు కాగా, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఇతర జిల్లాల్లోనూ భూగర్భజలాలు గణనీయంగా పడిపోతున్నాయన్నారు. 120 కిలోమీటర్ల పొడవున గోదావరి పూర్తిగా నీరులేకుండా ఎండిపోతుందని,
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ వైఫల్యం కారణంగా గోదావరిలో నీటి ప్రవాహం తగ్గిపోయిందని, మేడిగడ్డ బ్యారేజ్ సహా ప్రాజెక్టు నీటి భద్రతను నిలబెట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన వెల్లడించారు. ప్రజలకు తాగునీటిని అందించిన మిషన్ భగీరథ ఇప్పుడు పూర్తిగా కుంటుపడిందని, ప్రజలు మళ్లీ బోర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆయన తెలిపారు.