Sunday, September 8, 2024

సిఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ

- Advertisement -
- Advertisement -

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో గ్రూప్స్, డిఎస్‌సి అభ్యర్థులు, నిరుద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తుంటే, ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం శోచనీయం అని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద మనసుతో వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సింది పోయి, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా మీడియా సమావేశం నిర్వహించి ఉసూరుమనిపించారన్నారని వాపోయారు. గ్రూప్స్, డిఎస్‌సి అభ్యర్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం తదితర అంశాలపై సిఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. గ్రూప్- 1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతించాలని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క గతంలో కాంగ్రెస్ శాసన సభాపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రకటించిన వైఖరికి కట్టుబడి మెయిన్స్‌కు 1:100 చొప్పున ఎంపిక చేసి ఉద్యోగార్థులకు తగిన న్యాయం చేయాలని కోరారు.

ఇచ్చిన మాటను నిలుపుకోవాల్సిన బాధ్యత సిఎం ఉంది
గ్రూప్ -2 పరీక్షకు రెండు వేల ఉద్యోగాలు, గ్రూప్ -3 పరీక్షకి మూడు వేల ఉద్యోగాలు అదనంగా కలుపుతామని ఇచ్చిన మాటను నిలుపుకోవాల్సిన బాధ్యత సిఎం రేవంత్ రెడ్డిపై ఉందని హరీశ్‌రావు లేఖలో పేర్కొన్నారు. పోటీ పరీక్షల మధ్య కాలవ్యవధి చాలా తక్కువ ఉండటం వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మీరు మేనిఫెస్టోలో చెప్పిన దానికి కట్టుబడి మొత్తం ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసే విధంగా మెగా డిఎస్‌సి నిర్వహించాలని సిఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని హరీశ్‌రావు లేఖలో పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి తదనుగుణంగా నోటిఫికేషన్లను జారీ చేయాలని కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారని, నిరుద్యోగ భృతిని నెలనెలా చెల్లించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వెంటనే జిఒ 46 ద్వారా ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News