హైదరాబాద్: రవీంద్రభారతిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పదేళ్ల ప్రగతి నివేదికను మంత్రి హరీశ్ రావు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాష్ట్రంలో వైద్య కళాశాలల సంఖ్య 56కు చేరిందన్నారు. 2014కు ముందు 3 డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉండేవి. ఇవాళ 82 డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయని వెల్లడించారు. త్వరలో ప్రతి నియోజకవర్గానికి ఒక డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తామని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసియులు 5 మాత్రమే ఉండేవి. ఇవాళ ఐసియుల సంఖ్య 80కి చేరిందన్నారు. పేదలపై సిఎం కెసిఆర్ కు ఉన్న ప్రేమకు ఇదే నిదర్శని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మాతా, శిశుమరణాలు గణనీయంగా తగ్గాయి. 108 అంబులెన్స్ ల సంఖ్య 450కి పెంచామన్నారు. ఇవాళ రాష్ట్రంలో 300 అమ్మఒడి వాహనాలు ఉన్నాయని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
ఒకప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 30 శాతమే, ఇవాళ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 76 శాతానికి పెరిగింది. అవయవమార్పిడి శస్త్రచికిత్సలో తెలంగాణ ముందుందన్నారు. నిమ్స్ లో 6 నెలల్లో 100 అవయవమార్పిడి శస్త్రచికిత్సలు చేశామని తెలిపారు. రూ. 30 లక్షలు ఖర్చయ్యే చికిత్సలు ఉచితంగా చేస్తున్నామని వెల్లడించారు. పిజి వైద్య సీట్లలో దేశంలో రెండోస్థానంలో చేరాం. వైద్యంలో నీతిఆయోగ్ ర్యాంకుల్లో మూడో స్థానానికి చేరామని స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో మందులు లేవు, ప్రైవేటులో కొనుక్కోండి అని చెప్పే పరిస్థితి లేదన్నారు. ఆరోగ్య శాఖకు రూ. 12,364 కోట్లు కేటాయించామన్న మంత్రి నిమ్స్ ను 4వేల పడకలకు పెంచుకున్నామని తెలిపారు.