Monday, December 23, 2024

అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట: స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఒకేరోజు కోటి మొక్కలు నాటే వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమంతో పాటు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి తెలంగాణకు హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించారని మంత్రి హరీశ్ చెప్పారు. తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో రాష్ట్రంలోనే సిద్ధిపేట జిల్లా రెండవ స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు.

సిద్ధిపేట శివారు రంగనాయక సాగర్ తెలంగాణ తేజోవనంలో శనివారం ఉదయం జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి హరీశ్ రావు 30వేల మొక్కలు నాటారు. అనంతరం ఆర్ట్ గ్యాలరీ సందర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హరితహారం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకూ 273.33 కోట్లు మొక్కలు నాటి, దేశంలోనే అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డులో నిలిచిందని కేంద్రం పార్లమెంటులో చెప్పిందని వెల్లడించారు. ఆ తర్వాత 30 కోట్ల మొక్కలు నాటి మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు.  ప్రపంచంలో పర్యావరణ హితమై బ్రెజిల్, చైనా తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అతిపెద్ద మానవ ప్రయత్నం హరితహారం కార్యక్రమంగా చరిత్రకెక్కిందని మంత్రి హరీశ్ వెల్లడించారు. అడవులు పెరగాలి. కోతులు వాపస్ పోవాలనే సీఎం కేసీఆర్ నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలతో గ్రీన్ కవర్ పెరిగిందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పచ్చదనంతో ఇప్పటికే 28 శాతానికి చేరిందని, మరో 5 శాతం సాధిస్తే 33 శాతం అడవులు ఉన్న రాష్ట్రంగా దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అవుతుందని అన్నారు. అన్నింటా ఆదర్శంగా నిలిచినట్లే ఇప్పటికే ఆకుపచ్చ సిద్ధిపేటగా మార్చుకున్నామని, సిద్ధిపేట స్వచ్ఛబడి సందర్శించి చెత్త నుంచి సంపద ఏలా సృష్టించొచ్చునో స్వచ్ఛత పాఠాలు నేర్చుకోవాలని చెప్పారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ కు మంత్రి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News